ప్రజాశక్తి-పాడేరు:ఎర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టును మోడీ ఆదేశాలతోనే కార్పొరేట్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడంపై బాక్సైట్ తరహా పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంఘం జాతీయ నాయకులు పి.అప్పలనర్శ హెచ్చరించారు. చింతపల్లి మండలం ఎర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు శ్రీ సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్, అదానీకి పెదకోట గ్రామంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన సంఘం ఎర్రవరం గ్రామంలో బుధవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జాతీయ నాయకులు పి.అప్పలనరస మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో అటవీ వనరులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, గిరిజన ప్రాంతాల పట్ల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఖరిలో మార్పు వచ్చిందని అన్నారు. తన వ్యక్తిగత రాజకీయా అవసరాల కోసం ప్రధాని మోడీ మిత్రులైన అదానీ, శ్రీ సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్‌కు హైడ్రో పవర్ ప్రాజెక్టును అప్పగించాలని క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం 1/70 చట్టానికి, సుప్రీం కోర్టు తీర్పుకి విరుద్ధంగా ఉందన్నారు. గిరిజన పోరాటానికి తలోగ్గి బాక్సైట్ తవ్వకాల జీవో నెంబర్ 97ను రద్దు చేశారని, గిరిజన ప్రాంత హక్కులు, చట్టాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరిలో మార్పు వచ్చిందని, అందుకే కేంద్ర అటవీ సంరక్షణ చట్టాన్ని సవరణకు కేంద్రం ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాలలో సవరణ బిల్లు ప్రవేశ పెట్టాలని అఖిల పక్ష సమావేశం లో కేంద్ర ప్రభుత్వం ఎజెండా పెట్టిందని తెలిపారు. చట్ట సవరణలు అనంతరం అటవీ ప్రాంతంలో మైనింగ్, పవర్ ప్రాజెక్టు లను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే పక్రియ సులవతరం కానుందన్నారు. గిరిజన గ్రామ సభ ఆమోదం, గిరిజన సలహా మండలి (టిఏసి) తీర్మానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా కార్పొరేట్ సంస్థలకు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అప్పగించడం సరైంది కాదన్నారు. పీసా, అటవీ హక్కుల చట్టం, 1/70 చట్టాలను గిరిజన ప్రాంతాల్లో అమలులో ఉన్నా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సవత్సరాలుగా గ్రామంలో సర్వే నిర్వహించిందని, గత ఏడాది డిసెంబర్ 23న అటవీ, పర్యావరణ అనుమతులను మోడీ ప్రభుత్వం మంజూరు చేసిందని, హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేస్తే గిరిజన గ్రామ ప్రజలు నిర్వాసితులు అవుతారని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పసంహరించుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక గిరిజనులకు 100శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పిస్తున్న జీవో 3 పునరుద్ధరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్యాబినెట్లో ఏనాడూ చర్చ పెట్టకుండా గిరిజన ప్రాంతాన్ని సర్వనాశనం చేయలనుకోడం అన్యాయమన్నారు. విద్యా సంస్థలలో విద్యార్థి, గిరిజన ప్రజా సంఘాలు ప్రవేశాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు. గిరిజన ప్రాంతాల్లో సహజ సంపద దోపిడీ పై గిరిజన ప్రజా ప్రతినిధులు స్పందించాలని పిలుపునిచ్చారు.
ముందుగా ఏర్రవరం గ్రామంలో ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ ఆయుధాలు ప్రదర్శించి మోడీ, జగన్‌ను హెచ్చరిస్తూ నిరసన ప్రదర్శనలు జరిపారు. సంప్రదాయ ఆయుదలైన విల్లంబులు, ఈటెలు, కత్తులు, గోడ్డలతో దిష్టి బొమ్మ పై దాడి చేసి దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ బోనంగి చిన్నయ్య పడాల్, జిల్లా ఉపాధ్యక్షుడు పాంగీ ధనుంజరు, మండల కార్యదర్శి సింహాచలం, గ్రామ ఉప సర్పంచ్ సోమరాజు, మాజీ వైస్ ప్రెసిడెంట్ బెన్నా స్వామి, వేణుగోపాల్, రాజు, రాజుబాబు, మంగ రాజు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.










