Feb 19,2021 07:20

     భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం... రక్షణ విధానంలో తమకు ఎవరూ సాటిరారని డబ్బా వాయించుకుంటోంది. రక్షణ వ్యవహారాల్లో, ఆధునీకరణ విషయంలో, బడ్జెట్‌ కేటాయింపుల్లో, సైనిక శక్తి సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో గత పాలక వర్గాలు విఫలమయ్యాయట! మోడీ అధికారం లోకి రాగానే 2014లో గతంలో వాజ్‌పేయి ప్రవేశ పెట్టిన నూతన రక్షణ పారిశ్రామిక విధానానికి, ముఖ్యంగా అమెరికాతో కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఎఫ్‌డిఐ ని పెంచిందని గొప్పలు పోయింది. బడ్జెట్‌ కేటాయింపుల విషయంలో ముఖ్యంగా 'విధానపరమైన మద్దతు, ప్రోత్సహకాలు' అనే సూత్రాల ఆధారంగా 10 అంశాలతో కూడుకున్నదని బిజెపి చెప్పుకుంటోంది. 1. ఎఫ్‌డిఐ విధానం 2. వ్యూహాత్మక భాగస్వామ్యం 3. డిఫెన్స్‌ ఆఫ్‌సెట్‌ విధానం 4. డిఫెన్స్‌ ఇండిస్ట్రియల్‌ కారిడార్లు 5. పారిశ్రామిక లైసెన్సులు 6. డిఫెన్స్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్నోవేషన్లు 7. డిఫెన్స్‌ ఇన్వెస్టర్‌ సెల్‌ 8. ఎగుమతులకు అనుమతి 9. ప్రయివేటు కంపెనీలకు రిజిస్ట్రేషన్‌ అనుమతి అవకాశం 10. మేకిన్‌ ఇండియా పోర్టల్‌. ఈ విధానాల వెలుగులోనే గత ఆరేళ్లగా బడ్జెట్‌ కేటాయింపులు జరుగుతున్నాయి.
'రక్షణ బడ్జెట్‌ వివిధ శాఖలకు ఎలా కేటాయించబడింది?' అని చర్చించే ముందు పైన తెలిపిన విధానపరమైన మద్దతు, ప్రోత్సాహకాల విధానాన్ని పరిశీలిస్తే దేశీయంగా 9 ప్రభుత్వ రంగ రక్షణ పరిశ్రమలు, 41 ఆయుధ కర్మాగారాల ఉత్పత్తులు దాదాపు 75-80 శాతం, సుమారు 274 వివిధ రకాల ఆయుధ ఉత్పత్తులను 446 లెసెన్స్‌ల రూపంలో బడా కార్పొరేట్‌ సంస్థలకు మంజూరు చేశారు. ప్రధానంగా ఈ ఉత్పత్తులు ఇండిస్ట్రియల్‌ క్లస్టర్‌ జోన్లలో 1. టాటా అడ్వాన్స్‌ సిస్టమ్స్‌ 2. రిలయన్స్‌ డిఫెన్స్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ 3. మహింద్రా 4. ఆదానీ డిఫెన్స్‌ అండ్‌ ఏరో స్పేస్‌ 5. గోద్రేజ్‌ ఏరో స్పేస్‌ 6. ఎల్‌ అండ్‌ టి 7. కిర్లోస్కర్‌ లిమిటెడ్‌ 8. డైనమిక్‌ టెక్నాలజీస్‌ 9. అశోక్‌ లేలాండ్‌ 10. పుంజ్‌ లాయిడ్‌ 11. జెన్‌టెక్‌ 12. అస్త్రా మైక్రోవేవ్స్‌ లిమిటెడ్‌, అనేక మధ్యతరహా పరిశ్రమలకు సైనికులకు కావలసిన యూనిఫాం మొదలుకొని అసాల్ట్‌ రైఫిళ్లు, ఫీల్డ్‌ గన్నులు, మిసైళ్లు, భారీ వాహనాలు, భారీ యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు ఉత్పత్తి చేయడానికి విధానపరమైన అనుమతులు ఇచ్చిందీ ప్రభుత్వం. వీటితోపాటు నాగ్‌పూర్‌లో ధీరూభారు అంబానీ ఏరో స్పేస్‌ పార్కు, తమిళనాడులో ఒక ఇండిస్ట్రియల్‌ పార్కు, బెంగళూరు, ఢిల్లీ, హర్యానా, కొచ్చి, తెలంగాణలో ఆదిభట్ల మొదలగు అనేక ప్రాంతాల్లో ప్రయివేటు రంగంలో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేశారు.
పై నేపథ్యంలో 41 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలకు గత ఆరేళ్లగా కేటాయింపులు తగ్గిస్తూ తాజాగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.113.88 కోట్లు మాత్రమే కేటాయించారు. రక్షణ పరిశోధనకు మొత్తం రక్షణశాఖ బడ్జెట్‌లో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ, క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కలిపి రూ. 20 వేల 457 కోట్లు మాత్రమే కేటాయించారు. రక్షణ రంగ పరిశ్రమల కేటాయింపులు పరిశీలిస్తే అసలు కథ అర్థమవుతుంది. హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ విశాఖపట్నం 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ, సబ్సిడీ రూపంలో రూ.4 కోట్ల 84 లక్షలు కేటాయించి ఖర్చు చేసింది శూన్యం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులు '0'. మరొక ముఖ్యమైన పరిశ్రమ బిఇఎంఎల్‌ (బెంగుళూరుకు) 2020-21 ఆర్థిక సంవత్సరానికి క్యాపిటల్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌గా రూ.620 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది ఒక కోటి మాత్రమే. తాజాగా ఈ పరిశ్రమను ప్రయివేటీకరణ చేయాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా 54 శాతం ఉన్న ప్రభుత్వ వాటాను 38 శాతానికి తగ్గించారు. మరొక సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్‌ లిమిటెడ్‌కు 2020-21 సంవత్సరానికి క్యాపిటల్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌గా రూ.716 కోట్లు కేటాయించి 2021-22 సంవత్సరానికి కేటాయింపులు '0' (శూన్యం). మరొక ప్రధానమైనటువంటి క్షిపణి ఉత్పత్తులు చేస్తున్న బిడిఎల్‌ కు 2020-21 సంవత్సరానికి రూ.2404 కోట్లు కేటాయించి 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఏ మాత్రం కేటాయింపులు చేయలేదు. ప్రస్తుతం ఉన్న రూ.8100 కోట్ల విలువైన ఉత్పత్తి పైనే రానున్న నాలుగైదు సంవత్సరాలకు ఈ పరిశ్రమ మనుగడ ఆధారపడి ఉంటుంది. నవరత్న కంపెనీ అయిన హెచ్‌ఎఎల్‌ కు 2021-22 ఆర్థిక సంవత్సరానికి క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కేటాయింపులు శూన్యం. గత సంవత్సరమూ ఇదే పరిస్థితి. కేవలం రానున్న 8 నుంచి 10 ఏళ్ల కాలంలో అత్యాధునిక ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తేజస్‌కు రూ.48180 కోట్లు, తేలికపాటి హెలిక్యాప్టర్ల ఉత్పత్తులకు కేటాయించిన నిధులపై ఆధారపడి సంస్థ మనుగడ ఉంటుంది.
ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశ పెడుతూ ఆర్థిక శాఖామాత్యులు నిర్మలా సీతారామన్‌ భవిష్యత్తులో విధానపరమైన నిర్ణయాలలో భాగంగా వ్యూహాత్మక రంగాలైన రక్షణ, అణు, అంతరిక్ష సంస్థలు కూడా ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రక్షణ కేటాయింపులున్నాయి. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఫిబ్రవరి 2న బెంగళూరులో ఏరో ఎగ్జిబిషన్‌ ప్రారంభిస్తూ రానున్న ఏడేళ్ల కాలంలో భారత సైనిక వ్యవస్థ ఆధునీకరణకు సుమారు 9.48 లక్షల కోట్లు (133 బిలియన్‌ డాలర్లు) వ్యయం చేయనున్నట్లు తెలిపారు. అనగా రానున్న 5 నుంచి 7 సంవత్సరాలలో 41 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలకు, 9 రక్షణ రంగ పరిశ్రమలకు, రక్షణ పరిశోధన విభాగానికి కేటాయింపులు తగ్గిస్తూ పైన తెలిపిన బడా కార్పొరేట్‌ సంస్థలకు అన్ని రకాల యుద్ధ పరికరాలను ఉత్పత్తి చేయడానికి ప్రోత్సాహకాలిచ్చే విధానపరమైన నిర్ణయంతో మోడీ ప్రభుత్వం ముందుకు పయనిస్తున్నదన్నమాట. నేరుగా వంద శాతం ఎఫ్‌డిఐ లు ఈ ప్రయివేటు కంపెనీలలో పెట్టుబడులు పెడతాయి. 41 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను కార్పొరేట్‌ సంస్థలుగా మార్చాలని విధానపరమైన నిర్ణయం జరిగింది. ఉద్యోగ సంఘాల ఐక్య ఉద్యమాల వల్ల అమలుకు జాప్యం జరుగుతున్నది. మొదట్లో 'మేకిన్‌ ఇండియా' తాజాగా 'ఆత్మనిర్భర్‌ భారత్‌' పేరున మొత్తం రక్షణ ఆయుధ ఉత్పత్తులను ఈ బడా కార్పొరేటు సంస్థలకు ధారాదత్తం చేయాలని మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ వెలుగులోనే గత రెండేళ్ల బడ్జెట్‌ కేటాయింపులు, చేసిన ఖర్చు పరిశీలించాలి.
'ఆత్మనిర్భర్‌ భారత్‌' అంటే విదేశీ ప్రత్యక్ష నిధులు నూరు శాతం ప్రయివేటీకరణ దిశగా పయనిస్తూ స్వావలంభనకు, దేశీయ ఉత్పత్తులకు తిలోదకాలు ఇవ్వడమేనా? 'ఆత్మనిర్భర్‌ భారత్‌' అంటే, భారత రక్షణ విధానమంటే, అమెరికా కనుసన్నలలో అమెరికాతో కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యమేనా? 'ఆత్మనిర్భర్‌ భారత్‌' పేరిట విదేశీ బహుళజాతి రక్షణ ఉత్పత్తి సంస్థలకు బార్లా దర్వాజ కులాయించి రక్షణ బడ్జెట్‌లను దోచిపెట్టడమేనా? 'ఆత్మనిర్భర్‌ భారత్‌' అంటే 41 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు, 9 రక్షణ రంగ పరిశ్రమలు 52 డిఆర్‌డిఓ ల్యాబొరేటరీలను కాదని మొత్తం రక్షణ ఉత్పత్తులను దేశీయ బడా కార్పొరేట్‌ సంస్థలకు అప్పచెప్పడమేనా? ఈ విధానాలను దేశభక్తియుతమైన మన ప్రజలు ప్రతిఘటించాలి.

gopalarao

                                                              - జి.టి. గోపాల్‌రావు