క్విట్ ఇండియా డే సందర్భంగా ఏలూరులో నిరసన
మోడీ ప్రభుత్వ కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలపై ఉద్యమం తీవ్రతరం
సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ నాయకులు
ప్రజాశక్తి - ఏలూరుఅర్బన్
క్విట్ కార్పొరేట్.. సేవ్ ఇండియా, సేవ్ అగ్రికల్చర్ అంటూ క్విట్ ఇండియా డే సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యాన రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు నగరంలో నినదించారు. కార్పొరేట్ల లూటీ నుండి దేశాన్ని కాపాడండి అంటూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వ రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ స్థానిక జ్యుట్‌మిల్ సెంటర్‌లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, ఎపి రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, బికెఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ కిసాన్‌సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహనరావు, సిఐటియు జిల్లా నాయకులు పి.కిషోర్, ఎఐకెకెఎస్ రాష్ట్ర అధ్యక్షులు డి.రంగనాథ్, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, ఎఐటియుసి జిల్లా నాయకులు కె.కృష్ణమాచార్యులు మాట్లాడారు. 1942 ఆగస్టు 9న స్వాతంత్రోద్యమంలో ఉత్సాహం.. ఉత్తేజాన్నిచ్చిన క్విట్ ఇండియా స్ఫూర్తితో కార్మిక, కర్షక ఐక్యతతో దేశాన్ని లూటీ చేస్తున్న కార్పొరేట్లకు వ్యతిరేకంగా క్విట్ కార్పొరేట్ నినాదంతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు దేశ సంపదను కారు చౌకగా కట్టబెడుతూ ప్రజలపై భారాలు వేస్తోందని విమర్శించారు. గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో కార్పొరేట్ కంపెనీలకు రైటాఫ్ పేరుతో రూ.12 లక్షల కోట్లు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. వ్యవసాయ నష్టాలతో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు మాత్రం రుణమాఫీ లేదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అంబానీ, అదానీలకు దారాదత్తం చేస్తోందని విమర్శించారు. మరోవైపు వ్యవసాయాన్ని కార్పొరేట్ల పరం చేయాలని కుట్ర చేస్తోందన్నారు. కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తోందని అన్నారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమ సందర్భంగా లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని చెప్పారు. ఇప్పటికైనా రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలు ఒకదఫా మాఫీ చేయాలని కోరారు. సమగ్ర పంటల బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేసి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపు ఆపాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు పటిష్టంగా ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టియు నేతలు బద్దా వెంకట్రావు, యర్రా శ్రీనివాసరావు, ఎఐటియుసి నాయకులు పుప్పాల కన్నబాబు, చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పి.ఆదిశేషు, ఎపి రైతుసంఘం నాయకులు సున్నా వెంకట్రావు, గండి రాజా, వాడవల్లి రామారావు, ఆయా సంఘాల నాయకులు పి.వీరునాయుడు, పోలా భాస్కర్, ఎం.రాము, ఆర్.నూకరాజు, కోసూరి చంద్రకాంతమ్మ, లంక రామ్మోహన్, గేదెల నాగేశ్వరరావు, పి.పెంటయ్య, బైరెడ్డి లక్ష్మణరావు, బుగ్గల ప్రభాకర్, దువ్వూరి సుబ్బారావు, ఎస్.అప్పారావు, జి.వెంకటరమణ, వాడవల్లి రామారావు, పల్లె గంగరాజు, బండి నాగేశ్వరరావు, ఎస్.సోమేశ్వరరావు, కె.భాస్కర్, జి.ఈశ్వరరావు, ఎం.ఇస్సాక్, ఎస్.సత్యనారాయణ పాల్గొన్నారు.










