
ప్రజాశక్తి - పోలవరం
బిజెపి ప్రభుత్వం ఉపాథి హామీని కొల్లగొట్టి, కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పాలని చూస్తుందని సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ తెలిపారు. ఉపాథి హామీ పని చట్టాన్ని కాపాడుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన ఏలూరులో జరుగుతున్న రాష్ట్రస్థాయి సదస్సును జయప్రదం చేయాలని కోరారు. సోమవారం చేగొండపల్లి గ్రామంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో ఉపాథి హామీకి రూ.2 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉండగా, కోత కోసి నిధులు ఇస్తున్నారని, కుటుంబానికి రెండు వందల రోజులు పని, 600 రూపాయలు వేతనం ఇవ్వాలని తెలిపారు. పట్టణ ప్రాంతాలకు ఉపాథి పనిని విస్తరింపచేసి, రెండు పూటలా పని విధానాన్ని రద్దు చేయాలన్నారు. జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాథి పని ప్రదేశాల్లో మెడికల్, టెంట్లు, కనీస సౌకర్యాలు కల్పించకుండా ఎండలోనే పనులు చేపిస్తున్నారన్నారు. ఆన్‌లైన్ మస్తర్‌ను రద్దుచేసి, పాత పనిని అమలు చేయాలని, పే స్లిప్పులు ఇవ్వాలని క్షేత్రస్థాయిలో మెట్లకు స్మార్ట్ ఫోన్లు, ఐదు రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఎం పోలవరం మండల కార్యదర్శి గుడెల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో సదస్సు కరపత్రాలను విడుదల చేశారు.