

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : కార్పొరేట్ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే విద్యుత్ సంస్కణల అమలు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు అన్నారు. స్టార్ట్ మీటర్ల ఏర్పాటు ద్వారా వినియోగదారులు ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ వస్తుసామగ్రి డేటాను సేకరించి ప్రైవేటు పెట్టుబడిదారులకు కట్టబెడతారని చెప్పారు. తద్వారా వినియోగదారులకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ విధానం వల్ల పెట్టుబడిదారులు లాభాలు పొండంతోపాటు ఉన్న ఉద్యోగాలకు ఎసరు, భవిష్యత్తులో నిరుద్యోగ సమస్య వంటివి ఉత్పన్నమౌతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్కరణలు - ప్రజలపై భారాలు అన్న అంశంపై గురువారం విజయనగరంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో సిపిఎం విజయనగరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అధ్యక్షతన రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటం చేయాలంటూ సిపిఎం విజయనగరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. తొలుత తులసీదాస్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వద్ద సిఎం జగన్మోహన్‌రెడ్డి అప్పులకోసం తలొగ్గారని అన్నారు. ఇందులో భాగంగానే సగటు జనానికి ఆయువుపట్టులాంటి విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు వైసిపి ప్రభుత్వం పూనుకుంటుందన్నారు. దీనివల్ల కేవలం గృహ వినియోగదారులపై ఆర్థిక భారం, ప్రైవేటు పరిశ్రమల మనుగడకు ఇబ్బంది కలగడమే కాకుండా పాలిటెక్నిక్, ఐటిఐ వంటి అర్హతలతో పనిచేస్తున్న స్కిల్డ్, సెమీస్కిల్డ్ ఉద్యోగాలు గల్లంతవుతాయని, భవిష్యత్తులో విద్యుత్ రంగంలో ఉద్యోగ, ఉపాధి కల్పన, రిజర్వేషన్లు అమలు వంటివి కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వివరించారు. బ్రిటన్‌లో ఇప్పటికే ఈ పరిస్థితి ఏర్పడడంతో అక్కడి ప్రజలంతా ఆందోళన బాటపట్టారని అన్నారు. విద్యుత్ రంగంలోనూ ప్రీపెయిడ్ విధానం అమల్లోకి వస్తే సెల్‌ఫోన్ల రీఛార్జి మాదిరిగా నిర్థేశించిన యూనిట్ల వినియోగం తరువాత ఆటోమేటిక్‌గా విద్యుత్ సరఫరా ఆగిపోతుందని అన్నారు. దీనివల్ల రైతులు ఇబ్బంది పడడంతోపాటు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు అనంతరం రైతుల చేతిలో బిల్లులు పెట్టే పరిస్థితి ఏర్పడబోతుందని అన్నారు. సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ 20ఏళ్ల క్రితం సిపిఎం చేపట్టిన విద్యుత్ ఉద్యమంలో భాగంగా బషీర్‌బాగ్‌లో ప్రజలు ప్రాణాలకు సైతం తెగించి పోరాడారని గుర్తుచేశారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరిపి ప్రాణాలు తీసిందని, చివరకు విద్యుత్ భారాల పెంపును విరమించుకోక తప్పలేదని అన్నారు. ఆ తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి విద్యుత్ ఛార్జీల పెంపునకు సాహసం చేయలేకపోయారని అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక ట్రూఆప్, ఎఫ్‌పిపిసి సర్థుబాటు పేరుతో విద్యుత్ భారాలు మోపడంతోపాటు మొత్తం విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీనివల్ల ఫెర్రోఎల్లాయీస్ తదితర పరిశ్రమలు ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయాయని అన్నారు. ఈ విధానాన్ని సిపిఎంతోపాటు సిఐటియు వ్యతిరేకిస్తోంది. ప్రజల్ని, కార్మికవర్గాన్ని చైతన్యపర్చి మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ మాట్లాడారు.