Jun 26,2023 21:14

బద్వేల్‌: ఎడిఇ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్న ప్రజలు, సిపిఎం నాయకులు

 బద్వేలు పెంచిన విద్యుత్‌ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యుత్‌ రంగంలో కార్పొరేట్ల దోపిడీ ఆపకపోతే భవిష్యత్‌ అంధకారమే అవుతుందని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. సామాన్యులపై భారాలు ఆపకతే మరో విద్యుత్‌ ఉద్యమం తప్పదని, బాదుడు ఆగాలంటే ప్రజాపోరు సాగాల్సిన అవసరమెంతైనా ఉందని చెప్పారు. పెరిగిన విద్యుత్‌ ఛార్జీల బాదుడుకు నిరసనగా సోమవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్‌ ఎడిఇ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అన్వేష్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ను పేదలకు దూరం చేస్తున్నాయని, వేసవిలో సైతం ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి విద్యుత్‌ వాడుకోవాలంటే భయపడే దుస్థితి ఏర్పడిందని చెప్పారు. పేదల సంపాదనలో అత్యధిక భాగం విద్యుత్‌ బిల్లులకే సరిపోతుందని వాపోయారు. ముఖ్యమంత్రి పెరిగిన విద్యుత్‌ బిల్లులపై మౌనం దాల్చడం శోచనీయన్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సంక్షేమ పథకాలు లబ్ధి తమ గొప్పతనం అని చెప్పుకొని తిరుగుతూ, పన్నుల భారాలు, ధరల బాదుడు తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఆదానీ స్మార్ట్‌ మీటర్ల కంపెనీ ప్రారంభించడం, స్మార్ట్‌ మీటర్లు పెట్టాలని మోడీ ఆదేశించడం, జగన్‌ ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్ల టెండర్లు పిలవడం ఇవన్నీ అదాని కంపెనీకి ప్రజల సొమ్మును ధారాదత్తం చేసే కుట్రలో భాగమేనని చెప్పారు. విద్యుత్‌ బిల్లులు, స్మార్ట్‌ మీటర్ల పేరుతో ప్రజలను కొల్లగొడుతున్నారని తెలిపారు. బహిరంగ మార్కెట్లో అధిక రేట్లకు విద్యుత్‌ కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని, పేదలపై విద్యుత్‌ భారాలు మోపుతూ ప్రజలను బలిచేస్తోందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉండగా బాదుడే బాదుడని విమర్శించిన జగన్మోహన్‌ రెడ్డి విద్యుత్‌ దోపిడీపై సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలను బెదిరించి పన్నులు వసూలు చేస్తోందని, పెనాల్టీలు గుంజుతూ అభివృద్ధిని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాదుడుపై ప్రజలు తిరుగుబాటు చేసి, కార్పొరేట్ల దోపిడీకి అడ్డుకట్ట వెయ్యాలని, ప్రభుత్వ అవినీతిని నిగ్గదీయాలని, ఐక్యతతో ప్రజలు ఉద్య మించాలని విద్యుత్‌ సంస్కరణలపై సిపిఎం , వామపక్షాలు నికరమైన పోరు సాగిస్తున్నాయని, ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి కె.శ్రీను, కార్యదర్శి వర్గ సభ్యులు పఠాన్‌ చాంద్‌బాష, ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌, పట్టణ కమిటీ సభ్యులు ఇరగదిండ్ల రమణయ్య, షేక్‌ మస్తాన్‌, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని, శాఖ కార్యదర్శి కోడూరు చిన్నయ్య, మొలకాని శ్రీనివాసులు, సుబ్బరాయుడు, కైరున్‌ బీ, పార్టీ సభ్యులు బల్లి ఓబయ్య, గానుగ పెంట వెంకటసుబ్బయ్య, సగిలి రాయప్ప, గంప సుబ్బరాయుడు, గొడుగునూరు రాజగోపాల్‌, కాకర్ల బాబయ్య,శుభ క్రిష్ణ,మరియమ్మ,బీబీ పాల్గొన్నారు. పోరుమామిళ్ల టౌన్‌ : విద్యుత్‌ ఛార్జీల పేరుతో కార్పొరేట్ల జేబులు నింపుతూ ప్రజలపై పెను మోపుతున్నారని సిపిఎం మండల కార్యదర్శి ఎన్‌. భైరవ ప్రసాద్‌ అన్నారు .సోమవారం పోరుమామిళ్లలోని విద్యుత్‌ ఏడి భవనం దగ్గర సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 సంవత్సరంలో వాడుకున్న విద్యుత్‌కు మళ్లి యూనిట్‌కు 20 పైసలు, 2021 మే నెలలో వాడిన విద్యుత్‌కు మరో 20 పైసలు, 2023 ఏప్రిల్‌ లో పాడిన కరెంటు 40 పైసలు కలిసి మొత్తం 80 పైసలు చొప్పున జనం నెత్తిన భారమేశారన్నారు. ఇప్పటికే ట్రూ అప్‌, సర్దుబాటు ఛార్జీల పేరుతో అల్లాడుతున్న ప్రజానీకంపై మరో భారం వేయడం దారుణమని వాపోయారు. వెంటనే వైసిపి ప్రభుత్వం పెంచిన ఛార్జీలను తగ్గించాలని లేనిపక్షంలో 2000 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టిన గతే వైసిపి ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. అనంతరం విద్యుత్‌ సబ్‌ ఇంజినీర్‌కు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు గౌసియా బేగం, సభ్యులు రవి, శ్రీనివాసులు, బీబీ, లక్ష్మమ్మ, మున్ని, షరీఫ్‌, సయ్యద్‌ పీరా పాల్గొన్నారు. కలసపాడు : పెంచిన విద్యుత్‌ భారాలను వెంటనే తగ్గించాలని కెవిపిఎస్‌ సభ్యులు డి. ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కలసపాడు మండలంలోని విద్యుత్‌ అధికారి బ్రహ్మానంద రెడ్డికి ప్రజలు, రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే విద్యుత్‌ బకాయిలు తగ్గించకపోతే, ఉద్యమాలు తప్పవని వారు తెలియజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, సుదర్శన్‌, హుస్సేన్‌ పీరా పాల్గొన్నారు.