జూన్ 5, 1974న లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ''సంపూర్ణ విప్లవం'' పిలుపునిచ్చారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని సంయుక్త కిసాన్ మోర్చా నేడు దేశవ్యాప్తంగా ''కార్పొరేట్ల బారి నుండి దేశాన్ని కాపాడుకుందాం'' అన్న పిలుపునిచ్చింది. భారత వ్యవసాయ రంగానికి ఉరితాళ్ళ వంటి మూడు నల్ల వ్యవసాయ చట్టాల ప్రతులను, విద్యుత్ బిల్-2020 ప్రతులను గ్రామ గ్రామానా నేడు తగులబెట్టాలన్న కార్యక్రమం 500 రైతు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దేశమంతటా జరగనుంది.
నాటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అప్రజాస్వామిక-ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రముఖ గాంధేయ సామ్యవాది బాబూ జయప్రకాష్ నారాయణ్ సారథ్యంలో 1974లో చారిత్రాత్మక ఉద్యమం సాగింది. నాటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ నిరంకుశంగా ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను వేలాదిగా నిర్బంధించారు. పైగా అత్యవసర పరిస్థితిని విధించి పౌరుల ప్రాథమిక హక్కులను సైతం రద్దు చేశారు. ఆనాటి ఉద్యమం రగిల్చిన చైతన్యంతో 1977 సార్వత్రిక ఎన్నికల్లో నిరంకుశ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తుగా ప్రజలు ఓడించారు. అప్పుడు ఏర్పడిన జనతా ప్రభుత్వం పౌరహక్కులను పునరుద్ధరించడంతో పాటు రైతులు, సామాన్య ప్రజల అభివృద్ధి కోసం కొన్ని నిర్ణయాలను అమలు చేసింది. నాటి ఉద్యమంలో ప్రధానమైన పాత్ర యువతది, కాగా నాయకుడు జయప్రకాష్ నారాయణ్.
నేడు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది రైతులు దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ విధానాలతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలు వారి పరిస్థితిని ''పెనం మీంచి పొయ్యి లోకి'' నెట్టాయి. ఆ నల్ల చట్టాలకు విద్యుత్ బిల్లు-2020 తోడైంది. వీటికి వ్యతిరేకంగా నవంబర్ 26, 2020 నుండి కొనసాగుతున్న రైతాంగ ఉద్యమం స్వతంత్ర భారతావనిలో రెండవ అతి పెద్ద ఉద్యమంగా చెప్పవచ్చు. ఈ ఉద్యమంలో ప్రధాన పాత్రధారులు రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, ఉద్యోగ వర్గాల నాయకత్వం సమిష్టిగా 500 రైతు సంఘాల నాయకులతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా.
గుజరాత్‌లో చిమన్ భారు పటేల్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ, శాసనసభ రద్దు డిమాండ్‌తో జె.పి. నాయకత్వంలో ఉద్యమం ప్రారంభమైంది. తదుపరి బీహార్‌లో ప్రభుత్వ అవినీతిపై పోరాడుతున్న విద్యార్థుల పైన పోలీసుల పైశాచిక దాడులకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి. జూన్ 5, 1974న పాట్నాలో చారిత్రాత్మక గాంధీ మైదాన్ ర్యాలీలో జె.పి. ''సంపూర్ణ విప్లవం'' పిలుపునిచ్చారు. ఉద్యమ లక్ష్యం నెరవేరే వరకూ దీర్ఘకాల పోరాటాలకు, త్యాగాలకు సిద్ధం కావాలని జె.పి ఉద్బోధించారు. మళ్ళీ ఇప్పుడు రైతాంగం అదే స్ఫూర్తితో ఉద్యమం చేపట్టింది. 2018 లోనే 200 పైచిలుకు రైతు సంఘాలు ''ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ'' సారథ్యంలో న్యూఢిల్లీ లోని పార్లమెంట్ స్ట్రీట్‌లో చాలా పెద్ద సభను ఏర్పాటు చేశాయి. ఎమ్.ఎస్. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, రైతులకు రుణమాఫీ చెయ్యాలని, రైతుల ఆత్మహత్యల పరంపరకు అడ్డువేసేందుకు కేరళ రాష్ట్రంలో అమలవుతున్న ''రుణ ఉపశమన చట్టం'' వంటి దానిని కేంద్రం తీసుకురావాలని డిమాండ్ చేసినా మోడీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి మోడల్ ఎ.పి.యం.సి. యాక్ట్, మోడల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ 2018లను రూపొందించారు. వాటిని అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక నిధులను అందచేయగలదని, ఆ నిధులతో వ్యవసాయ మార్కెట్లలో మౌలిక వసతులను మరింత మెరుగుపరుచుకోవచ్చని ఆర్థిక మంత్రి పిబ్రవరి 2, 2020న బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంగా ప్రకటించారు. అయితే, కోవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తూ, లాక్‌డౌన్ కఠిన ఆంక్షలతో ప్రజలు, పలు విధాల నష్టపోతున్న విపత్కర పరిస్థితులను అదునుగా భావించి గౌతమ్ అదాని ఆఫీస్‌లో రూపొందించిన విద్యుత్ బిల్ 2020 ఆర్డినెన్స్‌ను ఏప్రియల్ 2020లో కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా ప్రకటించింది. దరిమిలా జూన్ 3, 2020న మూడు నల్ల వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్‌లను ప్రకటించింది. సెప్టెంబర్ 2020లో రాజ్యసభలో మెజారిటీ సభ్యులు ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి నివేదించాలని పట్టుబట్టినప్పటికి, ఓటింగ్ నిర్వహించాలని కోరినప్పటికి పెడచెవిన పెట్టి ఆమోదించినట్టు ప్రకటించుకున్నారు. కొన్ని లోపాలు ఉన్నప్పటికి కొంతమేరకైనా రైతాంగానికి ఉపయోగపడుతున్న వ్యవసాయ మార్కెట్ యార్డుల వ్యవస్థను పూర్తిగా నిర్యీర్యం చేసి రిలయన్స్ రిటైల్, డీమార్ట్, మోర్, మెట్రో, అదాని ఫార్చూన్, మెట్రో తదితర కార్పొరేట్ దిగ్గజాలకు రైతాంగ ప్రయోజనాలను బలిపెట్టడం ఈ బిల్లుల లక్ష్యం. మూడు నల్ల వ్యవసాయ చట్టాల వలన కార్పొరేట్లకు అత్యధికంగా లాభాలు చేకూరడం, రైతులు అతి తక్కువ ధరలకు తమ ఉత్పత్తులను అతి తక్కువ ధరలకు అమ్ముకోవలసి రావడం, వినియోగదారులపై భారం మరింత పెరిగే అవకాశం స్పష్టంగా వున్నాయి. అలాగే విద్యుత్ బిల్ వలన ప్రత్యేకంగా గౌతమ్ అదాని, ముకేష్ అంబానీలకు అత్యధికంగా మేలు చేకూరుతుంది.
కార్మికలోకం సంఘటితంగా పలు దశాబ్దాలపాటు పోరాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను తొలగించి, కార్మిక ప్రయోజనాలకు గండికొట్టేలా నాలుగు లేబర్ కోడ్‌లను మోడీ ప్రభుత్వం తెచ్చింది. ఇప్పటివరకు భారతదేశం సాధించిన పారిశ్రామిక ప్రగతికి ప్రధాన చోదకశక్తులుగా దోహదపడిన అనేక ప్రభుత్వ రంగ సంస్థలను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌తో సహా నూటికి నూరు శాతం కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను దాదాపు అన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దాదాపు వంద లక్షల కోట్ల ప్రజాధనం, డిపాజిట్ల రూపంలో బ్యాంకులలో వుంది. తాను అధికారంలో వున్న ఏడు సంవత్సరాలలో దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ల బకాయిలను రద్దు చేయడంతో ఆగకుండా మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థనే కార్పొరేట్ల హస్తగతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మార్చి 23, 24 తేదీలలో దేశవ్యాప్తంగా యావన్మంది బ్యాంక్ ఉద్యోగులు సమ్మెను నిర్వహించారు.
2020 ప్రారంభ దశలోనే కరోనాను కట్టడి చేయడంలో నిర్లక్ష్యం వహించిన మోడీ ప్రభుత్వం సెప్టెంబర్-డిసెంబర్ వ్యవధిలో కరోనాను జయించామని, ప్రపంచ దేశాలకు భారత్ వ్యాక్సిన్‌ను సరఫరా చెయ్యగలదని ప్రగల్భాలు పలికింది. కరోనా రెండవ వేవ్ ప్రమాదం గురించి శాస్త్రజ్ఞులు ముందుగా హెచ్చరించినా తగు నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేసింది. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోడానికి నరేంద్రమోడీ ప్రభుత్వమే ప్రధాన కారణమని మన దేశ ప్రజలేకాక పలు దేశాల శాస్త్రజ్ఞులు, ఆరోగ్యరంగ నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు సైతం మోడీ ప్రభుత్వం ప్రకటించిన వ్యాక్సిన్ విధానాన్ని తప్పుబట్టింది.
ఆనాడు జె.పి. ప్రవచించిన సంపూర్ణ విప్లవం స్ఫూర్తి ఈనాడు ఎంతో అవసరం. ప్రజల చేత, ప్రజల కొరకు, ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి అభివృద్ధికి కృషి చేయవలసి వుంటుంది. కానీ ఈనాడు కేంద్రంలోను, కొన్ని రాష్ట్రాలలోను అందుకు పూర్తి భిన్నంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తూ వున్నాయి. లక్షలాది మంది రైతులు, వృద్ధులు, మహిళలతో సహా ఆరు మాసాలకు పైగా శాంతియుతంగా ఉద్యమం కొనసాగిస్తూ వున్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరం పైగా మహిళలతో సహా శాంతియుతంగా వేలాదిమంది అమరావతి రైతులు ఉద్యమం కొనసాగిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని మార్చుకోలేదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే బి.జె.పి. నల్ల వ్యవసాయ చట్టాలను తెస్తామని కాని, విద్యుత్ బిల్-2020 తెస్తామని కాని, ఎల్.ఐ.సి, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్, బి.ఎస్.ఎన్.ఎల్, బి.పి.సి.ఎల్ లాంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు పలు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తామని కాని తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొనలేదు. మన రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో అమరావతి రాజధానికి ఆమోదం తెలపటమేకాక 30 వేల ఎకరాలు రాజధానికి వుండాలనడంతోపాటు తాడేపల్లిలో ఇల్లు కూడా నిర్మించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను విశాఖపట్నంనకు తరలించాలని నిర్ణయించడం ఎంతమాత్రమూ సరికాదు.
ఆనాడు జె.పి. ఆశించినట్లు ఈనాడు వ్యవస్థలతోపాటు ప్రజలలో కూడా మార్పు రావాల్సి వుంది. ఆనాడు అవినీతికి వ్యతిరేకంగా యువత పోరాడింది. ఆ ఫలితంగానే ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది. ఈ ఏడు సంవత్సరాలలో వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ రంగ ఆస్తులు అనగా ప్రజల ఆస్తులను కారుచౌకగా కార్పొరేట్లకు అమ్మివేస్తున్నప్పటికీ...పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ల ధరలను అడ్డగోలుగా, విపరీతంగా పెంచివేసినప్పటికి యువత తగినంతగా స్పందించడం లేదు. లక్షలాదిమంది వలస కూలీలు ఉపాధి కోల్పోయి రోడ్డుపాలయ్యారు. నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగింది. కేంద్ర ప్రభుత్వ అసమర్ధ, అహంభావ పూరిత వైఖరి, చేతకానితనం వల్ల లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ఈనాడు అత్యంత విషాదకర పరిస్థితులు నెలకొని వున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవస్థలలో మార్పు కోసం అన్ని వర్గాల ప్రజలు పాటుపడినప్పుడే జె.పి. ఆశించిన సంపూర్ణ విప్లవం ఆశయాలు సార్ధకమవుతాయి. క్రోనీ క్యాపిటలిజానికి తావు లేకుండా....కార్పొరేట్ల బారి నుండి భారత వ్యవసాయ రంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ బ్యాంకులను రక్షించుకునేందుకు అప్పుడే వీలు కలుగుతుంది.

- వడ్డే శోభనాద్రీశ్వరరావు / వ్యాసకర్త ఎ.పి. సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ /










