డిప్యూటీ సిఎం పీడిక రాజన్న దొర
ఇంగ్లీష్‌మీడియం బాలిక పాఠశాల భవనం ప్రారంభం
ప్రోటోకాల్ పాటించని అధికారులపై జెడ్‌పి చైర్‌పర్సన్ ఫైర్.
ప్రజాశక్తి డుంబ్రిగూడ:నాడు నేడు పథకం ద్వారా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను జగన్మోహన్‌రెడ్డి తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం, గిజన సంక్షేమ శాఖ మంత్రి పిడిక రాజన్న దొర అన్నారు. మంగళవారం స్థానిక జైపూర్ జంక్షన్‌లో నాడు నేడు నిధులతో నూతనంగా నిర్మించిన కిల్లోగుడా గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఇంగ్లీష్ మీడియం పాఠశాల భవనాలను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ఫాల్గుణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజన్నదొర మాట్లాడుతూ, గిరిజనులు బాగుండాలి గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే సిఎం జగన్ సంకల్పమని, మన్యవాసుల వెనుకబాటుతనాన్ని పోగొట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. అర్హతనే ప్రామాణికంగా వైసిపి ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. అన్ని రకాల వసతులు, సౌకర్యాలతో గిరిజన ఆశ్రమాల్లో ఇంగ్లీష్ పాఠశాలలను ప్రారంభించి నాణ్యమైన విద్యను సిఎం జగన్ గిరిబాలలకు అందిస్తున్నారని, దీన్ని అందిపుచ్చుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు మెనూఛార్జీలను పెంచే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అరకు ప్రాంతంలో రెస్టారెంట్లు, హోటల్స్, కాటేజీలు వంటివి పెట్టుకోవడానికి నిరుద్యోగ గిరిజన యువతకు ఐటిడిఎ ద్వారా రుణసౌకర్యం కల్పిస్తోందని, ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.. గిరిజన సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 700 పోస్టులతోపాటు హెచ్‌డబ్ల్యుఒ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. రాకపోకలను మెరుగుపరిచేందుకు కనెక్టివిటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రోటోకాల్ పాటించలేదని జెడ్‌పి చైర్‌పర్సస్ ఆగ్రహం
ఏజెన్సీలో ప్రభుత్వపరంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో జిల్లా పరిషత్ చైర్మన్‌గా, జిల్లా ప్రధమ పౌరురాలిగా తాను పాల్గొనేందుకు అధికారుల నుంచి ప్రొటోకాల్ ప్రకారం తనకు ఆహ్వానాలు అందకపోవడంపై జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర మండిపడ్డారు. గిరిజన ఆశ్రమ ఇంగ్లీష్ మీడియం బాలికల పాఠశాల, అరుకులో పెట్రోల్ బంకు ప్రారంభోత్సవాలకు తనను ఎందుకు ఆహ్వానించలేదని ఉపముఖ్యమంత్రి రాజన్నదొర సమక్షంలోనే నిలదీశారు. దీనిపై కలెక్టర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జిసిసి చైర్ పర్సన్ శోభ స్వాతి రాణి, ట్రైకార్ చైర్మన్ శతకం బుల్లిబాబు, ఐటిడిఎ పిఒ రోనంకి గోపాలకష్ణ, సబ్ కలెక్టర్ అభిషేక్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజా రమేష్, ఎంపిపి బి.ఈశ్వరి, జెడ్‌పిటిసి జానకమ్మ, సర్పంచ్ శారద పాల్గొన్నారు.










