అత్యున్నత బోధనా ప్రమాణాలు, ఆహ్లాదకరమైన వసతులతో విద్యా సేవలందిస్తున్నామని ప్రచార పత్రాల్లో గొప్పలు దట్టించే కార్పొరేట్ విద్యా సంస్థలు క్షేత్రస్థాయిలో మురికి కూపాలుగా కంపుగొడుతున్నాయి. రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ గురువారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అధిక ఫీజుల వసూళ్లతో పాటు ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవాలు చూసిన కమిషన్ సభ్యులే విస్తుపోయారంటే మన బిడ్డలు ఎంతటి దయనీయ స్థితిలో మగ్గిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.
'పుస్తకాల్లోనే మునిగి తేలాలి. తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా సమయానికి అందుబాటులో ఉండవు. స్నానం చేయాలన్నా, కాలకృత్యాలు తీసుకోవాలన్నా క్యూలు కట్టాల్సిందే. ఇంతలోనే బెల్ కొడితే పరిగెత్తాలి' ఇది కమిషన్ సభ్యుల ముందు పిల్లలు వెళ్లబోసుకున్న గోడు. తరగతులకు హాజరైన అనేక మంది పిల్లలు అశుభ్రంగా ఉన్నారని కమిషన్ కూడా నివేదించిందంటే పిల్లలు చెప్పిన మాటలన్నీ వాస్తవాలే. కళాశాల ప్రాంగణాలు, వసతి గృహాల్లో ఎటు చూసినా చెత్తాచెదారమే. వంట గదులు, మరుగు దొడ్లు కంపుకొడుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో పాటించాల్సిన శానిటైజేషన్ తదితర కనీస మార్గదర్శకాలను కూడా పాటించడం లేదు. లాక్‌డౌన్ సమయంలో మూత పడిన కళాశాల ప్రాంగణాల్లో హాస్టళ్లలో పేరుకుపోయిన చెత్తనూ తొలగించిందిలేదు. శానిటైజర్లు, మాస్కులు, అందుబాటులో ఉంచాల్సినా తనిఖీలు నిర్వహించిన ఏ కాలేజీలోనూ అలాంటి ఆనవాళ్లే లేవు. కార్పొరేట్ కాలేజీలకు విద్యార్థుల ప్రాణాలంటే ఎంత లెక్కలేని తనమో దీనినిబట్టే అవగతం చేసుకోవచ్చు. రాష్ట్రంలోని రెండు ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన అనేక బ్రాంచీల్లో ఇదే దుస్థితి.
కనీస సదుపాయలు కూడా పాటించని ఈ కార్పొరేట్ కంపెనీలు అధిక ఫీజులను వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. బోధనా ఫీజులే కాంకుండా ఒక్కొ విద్యార్థి నుంచి డొనేషన్లు, పాకేట్ మనీ, ఆటలు, కల్చరల్ యాక్టీవిటీస్, పుస్తకాలు, నోట్స్ ఇలా ఇష్టమొచ్చిన పేర్లు చెప్పి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. కోవిడ్ నేపథ్యంలో గత సంవత్సరమున్న ఫీజుల్లో 30 శాతం ఫీజు తగ్గించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ దానిని ఒక్క కాలేజీ కూడా అమల్జేయడం లేదు. కమిషన్ తనిఖీల్లోనే ఈ విషయంలో బయటపడటం గమనార్హం. వాస్తవానికి ఇంటర్మీడియట్ బోర్డు కానీ, పాఠశాల విద్యాశాఖ కానీ ఏ కాలేజీ ఎంత ఫీజు వసూలు చేయాలనే నిర్ధిష్ట ఉత్తర్వులు ఇచ్చింది లేదు.
కార్పొరేట్ కాలేజీల బాగోతాలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి. ఆకస్మిక తనిఖీల్లో ఇలాంటి విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చినా ఆ తర్వాత పాలకుల నిర్లక్ష్యంతో అవన్నీ సద్దుమణిగిపోయాయి. విద్యా వ్యాపారం దేశంలో నిషేదమన్న సంగతిని కూడా పాలకులు మర్చిపోయి 'కార్పొరేట్' సేవ చేస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు సాగిస్తున్న ఆగడాలను అడ్డుకోవాలనే చిత్తశుద్ధి పాలకులకూ ఎటూ లేదు. ప్రజలే ఈ దోపిడిని నిలువరించాలి. తల్లిదండ్రుల్లో చైతన్యం లేకపోతే తాము కూడా ఏం చేయలేమని రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ రెడ్డి కాంతారావు మాటల్లోనూ వాస్తవం లేకపోలేదు. కనీస వసతులు కూడా కల్పించని ప్రయివేటు కాలేజీలపై అంటువ్యాధుల చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కమిషన్ ప్రతిపాదిస్తామంటోంది. అందుకనుగుణంగా ఉన్నతాధికార్లు కఠిన చర్యలు తీసుకోవాలి. 'నాడు - నేడు' నినాదంతో విద్యారంగంలో నవశకం తీసుకొస్తామని చెబుతున్న ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలుగా లాభాలే పరమావధిగా దోచుకుంటున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా కార్పొరేట్ మోజులో పడిపోకుండా జాగ్రత్త వహించాలి. వినిమయ సంస్కృతిని రుద్దినట్టే విద్యా రంగాన్ని బ్రాండింగ్ చేసి సాగిస్తుస్తున్న దోపిడీని అడ్డుకోవాలి. కార్పొరేట్ కబంధ హస్తాల నుంచి విద్యా రంగాన్ని విడిపించుకొని ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేసుకోవాలి.










