ప్రజాశక్తి-అనకాపల్లి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక జివిఎంసి బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ట్యాబ్‌లను బుధవారం మంత్రి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నాణ్యమైన విద్యకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి విద్యార్థికి రూ.40 వేలు విలువైన ట్యాబ్‌లను రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి రూ.650 కోట్లు ఖర్చు చేసి అందజేస్తుందని చెప్పారు. 2019 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 38 లక్షల మంది విద్యార్థులు ఉండగా నేడు 45 లక్షలకు చేరిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చూసి కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షులు జానకిరామరాజు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, కార్పొరేటర్ జాజుల ప్రసన్న లక్ష్మి, జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, ఎంఈఓ దివాకర్, జాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.










