Feb 02,2022 08:06
  • ఎంఎస్‌పి ప్రస్తావన లేదు అన్నీ కోతలే రైతు వెన్ను విరిచే బడ్జెట్‌

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : వ్యవసాయ కార్పొరేటీకరణే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ పద్దు తయారైంది. సేద్యపురంగంలో కార్పొరేట్ల ప్రవేశానికి తెచ్చిన నల్ల చట్టాలను రైతులు వీరోచితంగా పోరాడి ప్రతిఘటించిన నేపథ్యంలో చట్టాలను ఉపసంహరించున్న మోడీ సర్కారు, మరో రూపంలో కార్పొరేటీకరణకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసింది. హైటెక్‌ సాగు పద్ధతులు, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం, ఆధునిక పద్ధతుల్లో భారీ యంత్రాలు, డ్రోన్లతో సేద్యం వంటివి బడ్జెట్‌లో పుష్కలంగా ఉన్నాయి. రైతులు పంటల కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత అడుగుతుండగా బడ్జెట్‌లో ఆ అంశాలు ప్రస్తావనకే రాలేదు. ఉపాధి హామీ, పిఎం కిసాన్‌, ఎరువుల సబ్సిడీ, వ్యవసాయ పరిశోధన వంటి ముఖ్య కేటాయింపులకు కోతలు పెట్టింది. వ్యవసాయానికి రూ.1,32,514 కోట్లు, ఎరువులు, రసాయనాల డిపార్టుమెంట్‌కు రూ.1,07,715 కోట్లు ప్రతిపాదించనట్లు చెబుతున్నా స్కీంల వారీగా చూస్తే బడ్జెట్‌ తగ్గడం, అత్తెసరు కేటాయింపులు చేయడం జరిగింది.
 

                                                          ఉపాధికి హామీ లేదు

గ్రామీణ పేదలకు కనీస ఉపాధిని గ్యారంటీ చేసే ఉపాధి హామీ చట్టం అమలుకు నిధులు తగ్గాయి.కరోనా వేరియంట్ల బెడద ఉండగానే కోతలు పడ్డాయి. కోవిడ్‌ తొలేడాది 2020-21లో ఉపాధి హమీకి రూ.1,11,170 కోట్లు ఖర్చు చేయగా, నిరుడు రూ.73 వేల కోట్లు ప్రతిపాదించారు. గీసిగీసి పనులు కల్పించిన మీదట రూ.98 వేల కోట్లకు సవరించారు. వచ్చే బడ్జెట్‌లో రూ.73 వేల కోట్లు పెట్టారు. ఇది పేదల ఉపాధికి గండికొట్టే చర్య.
 

                                                               సబ్సిడీలకు కత్తెర

అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరల్లో హెచ్చు తగ్గుల కారణంగా యూరియా ధరలు పెరుగుతున్నాయి. ఆ మేరకు రైతులకు సర్కారు సబ్సిడీ పెంచాల్సి ఉండగా అదేమీ లేదు. ముందటేడు యూరియా సబ్సిడీ రూ.90,549 కోట్లు ఖర్చు చేయగా, నిరుడు బడ్జెట్‌లో రూ.58,768 కోట్లు పెట్టారు. సవరించిన అంచనాల్లో రూ.75,930 కోట్లు అయింది. ప్రస్తుతం రూ.63,222 కోట్లకు తగ్గించారు. న్యూట్రియంట్‌ బేస్డ్‌ ఎరువుల సబ్సిడీ పద్దు సైతం చిక్కిపోయింది. ముందటేడు రూ.37,372 కోట్లు ఖర్చు చేయగా, నిరుడు రూ.20,762 కోట్లు పెట్టారు. సవరించిన అంచనాల్లో రూ.64,192 కోట్లన్నారు. ఇప్పుడు అంతకంటే తక్కువ రూ.42 వేల కోట్లు చూపారు. ఎన్‌,పి,కె ధరలు పెరుగుతున్నాయి. కంట్రోల్‌ ఎత్తేయడంతో డిఎపి, ఎంఒపి, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను కంపెనీలు పెంచుతున్నాయి. ప్రభుత్వం సబ్సిడీలకు కోతలు విధించింది. పంటల బీమా, మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌, వ్యవసాయ పరిశోధన, రైతులకు పరోక్షంగా లాభించే ఆహార భద్రత చట్టం అమలు, వికేంద్రీకరించిన పంట ఉత్పత్తుల సేకరణ ఇత్యాది వాటికి నిధులు తగ్గాయి.
 

                                                               ప్రైవేటీకరణ చర్యలు

వ్యవసాయంలో ప్రైవేటీకరణ చర్యలను బడ్జెట్‌లో ప్రముఖంగా పేర్కొన్నారు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం అన్నారు. కూలీల కొరత సమస్యను తీర్చేందుకు అద్దె ప్రాతిపదికన యంత్రాలను విరివిగా రైతులకు అందుబాటులోకి తెస్తారు. జీరోబేస్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌, సేంద్రీయ సాగును ప్రోత్సహిస్తారు. గంగానది పరీవాహక ప్రాంతంలో ప్రకృతి సేద్య కారిడార్‌ను అభివృద్ధి చేస్తారు. ఉత్పత్తులకు విలువ జోడించేందుకు మరిన్ని స్టార్టప్‌లకు ఊతం ఇస్తారు. పంటల మదింపు, భూరికార్డుల డిజిటలైజేషన్‌ చేస్తారు. డ్రోన్ల సాయంతో పురుగు మందుల పిచికారీని ప్రోత్సహిస్తారు. వ్యవసాయ వర్శిటీల్లో ఆధునిక వ్యవసాయంపై సిలబస్‌ ప్రవేశపెడతారు. 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు. నూనెల ధరల నియంత్రణకు ఆ పంటల సాగును ప్రోత్సహిస్తారు.

ొల



 

                                                           రైతువ్యతిరేక బడ్జెట్‌ !

  •  ఎఐకెఎస్‌ విమర్శ శ్రీ కక్షసాధింపు చర్యలా వుందని మండిపాటు

న్యూఢిల్లీ : ఇది రైతు వ్యతిరేక బడ్జెట్‌ అని అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) విమర్శించింది. రైతుల నిజమైన డిమాండ్లను ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని, సేకరణ, ఆహార, ఎరువుల సబ్సిడీలకు, గ్రామీణ ఉపాధి హామీ పథకం కేటాయింపుల్లో కోతలు విధించారని విమర్శించింది. రైతాంగం సాగించిన సుదీర్ఘకాల పోరాటానికి కక్షసాధింపు చర్యలుగా ఈ బడ్జెట్‌ కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. రైతులకు గానీ, వ్యవసాయ కూలీలకు గానీ ఎలాంటి ఉపశమన చర్యలు లేవు. రుణాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు హామీ కల్పించాలని చేసిన డిమాండ్ల పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందని మండిపడింది. ఈ మేరకు ఎఐకెఎస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. 2021-22లో మొత్తం కేటాయింపులు రూ.4,74,750.47 కోట్లుగా (సవరించిన అంచనాలు) వుండగా, ఈసారి లక్ష కోట్లకు పైగా క్షీణించి రూ.3,70,303 కోట్లుగా వుంది. ఇక గ్రామీణాభివృద్ధి రంగం వాటా 5.59శాతం నుండి 5.23శాతానికి పడిపోయింది. పంట బీమా, ఆహార, ఎరువుల సబ్సిడీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేటాయింపుల్లో కూడా భారీగా కోతలు విధించారని విమర్శించింది. 2022-23 సంవత్సరానికి వరి, గోధుమ సేకరణ కోసం రూ.2.37 లక్షల కోట్లు పక్కన పెట్టినట్లు ఆర్థిక మంత్రి పెద్దగా ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నించారని తెలిపింది. వాస్తవానికి, గతేడాది చేసిన రూ.2.48లక్షల కోట్ల కేటాయింపుల కన్నా ఇది తక్కువేనని ఎఐకెఎస్‌ పేర్కొంది. లబ్ధిదారుల సంఖ్య కూడా గతేడాది కన్నా గణనీయంగా తగ్గిపోయిందని తెలిపింది. గత సంవత్సరం 1.97కోట్ల మంది లబ్ధిదారులు వుండగా, ఈసారి ఆ సంఖ్య 1.63 కోట్లకి పడిపోయింది. అన్ని పంటలకు విస్తరించి, లబ్దిదారుల సంఖ్యను పెంచాలని కోరుతుండగా, అందుకు విరుద్ధంగా జరిగిందని ఆ ప్రకటన విమర్శించింది. కేటాయింపులు తగ్గడం, ద్రవ్యోల్బణం కలిసి 2022-23లో సేకరణ గణనీయంగా తగ్గడానికి దారితీస్తుందని హెచ్చరించింది. ఎరువుల సబ్సిడీకి కేటాయింపులు కూడా 25శాతం మేర తగ్గించారని, దీనివల్ల ఇప్పటికే పెరుగుతున్న ఎరువుల ధరలపై ఇది మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది. కరోనా సమయంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లిన వేళ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేటాయింపులు తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అసమానతలను, దారిద్య్రాన్ని పెంచడానికి, నిరుద్యోగం, ఆకలి పెరగడానికి ఈ బడ్జెట్‌ దోహదపడుతుందని హెచ్చరించింది. మోడీ ప్రభుత్వ విధానాలను, ధోరణిని నిరసిస్తూ అన్నివర్గాలను కలుపుకుని పోరాటాలు జరపాల్సిందిగా శాఖలకు పిలుపునిచ్చింది.