బడ్జెట్ సమావేశాల తొలి రోజు శుక్రవారం విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సర్వే అపసవ్య దిశను ఆవిష్కరించింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది లగాయతు గడచిన ఆరేళ్లల్లో భుజానికెత్తుకున్న క్రోనీ కేపిటలిస్టు పాఠాలను సర్వే మక్కీకి మక్కీ ఒప్పజెప్పింది. ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ ప్రభుత్వ ఆలోచనల్లోని కుసంస్కరణలకే పెద్ద పీట వేశారు. ఏడాది కాలంగా కరోనా మహమ్మారి, తదనంతర ప్రభుత్వ వైఫల్యాలు దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవన స్థితిగతులను ఏ విధంగా అతలాకుతలం చేశాయో తెలిసిందే. అనాలోచిత లాక్‌డౌన్లతో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిన దృష్టాంతాలను ఆర్థిక సర్వేలో ప్రభుత్వం అంగీకరిస్తూనే, ఏడాది ప్రారంభానికి ముందే తిష్ట వేసిన మాంద్యాన్ని కరోనా మాటున దాచేసే ప్రయత్నం చేసింది. 2019-20లో వృద్ధిరేటు అంతని ఇంతని కోతలు కోయగా చివరికి 4 శాతం కనాకష్టమైంది. అప్పుడు కరోనా లేదు. మహమ్మారి విజృంభించి లాక్‌డౌన్లు అమలైన 2020-21లో వృద్ధిరేటు మైనస్ 7.7 శాతంగా సర్వే అంచనా వేసింది. చివరికొచ్చేసరికి ఈ దిగజారుడు ఇక్కడన్నా ఆగుతుందో ఇంకా పతనమవుతుందో తెలీదు. కానీ కేవలం వ్యాక్సినేషన్ మొదలైందన్న ఒకే ఒక్క అంశం ప్రాతిపదికన, ప్రజల ఆదాయాలు, కొనుగోలు శక్తిని పెంచే కనీస ఉపశమన చర్యలు చేపట్టకుండా, వచ్చే ఏడాది వృద్ధి రేటు ఒక్క ఉదుటున 11 శాతానికి ఎగబాకుతుందని ఆర్థిక సర్వేలో ప్రభుత్వం గాలిలో మేడలు కట్టడాన్ని హద్దులు దాటిన అత్యాశ అనాలా, లేక మరో మోసం అనాలా ?
కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వలన భవిష్యత్తులో వ్యవసాయం, రైతుల ఉనికి ప్రశ్నార్ధకమవుతుందని అన్నదాతలు ఉద్యమిస్తుండగా, సదరు చట్టాలను ఆర్థిక సర్వే సమర్ధించింది. కోవిడ్ ఆపత్కాలంలో అన్ని రంగాలూ నిలిచిపోగా, వ్యవసాయం ఒక్కటే 3.4 శాతం వృద్ధిని నమోదు చేసిందని సర్వే అంగీకరించింది. ఆ ఘనత కృషీవలుర శ్రమతో సాక్షాత్కరించింది తప్ప ప్రభుత్వ పనితనం వలన కానే కాదు. రైతులు పంటలు పండించడానికే పరిమితం కాకూడదని, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, సేద్యం వ్యాపారంగా మారాలని, చిన్న, సన్నకారు రైతులు భూములను తెగనమ్ముకోవాలని, వ్యవసాయ చట్టాల్లోని కార్పొరేట్ అంతరసారాన్ని సర్వే వల్లె వేసింది. జాతీయ స్థూలోత్పత్తి (జిడిపి)లో వ్యవసాయ వాటా తగ్గుతుండగా, దాన్ని పెంచే వ్యూహాన్ని అన్వేషించే బదులు ఆ రంగం నుంచి ప్రజలను సేవా రంగం వైపు మళ్లించమని సలహా ఇచ్చింది. సబ్సిడీల హేతుబద్ధీకరణ సర్వే నిర్దేశించిన మరో దారుణం. ఆకలి సూచిలో మన దేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే అథమంగా ఉండగా, కొద్దిపాటిగానైనా ప్రజాపంపిణీ ద్వారా పేదలకు అందిస్తున్న బియ్యం, గోధుమలు, చిరుధాన్యాల ధరలు పెంచాలని సలహా ఇచ్చింది. ధరలు పెంచితే ఆ భారం పేదలపైనైనా పడుతుంది. లేదంటే రాష్ట్రాలైనా పెట్టుకోవాలి.
కార్పొరేట్ల 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'ను ఇంకా ఇంకా సులభతరం చేసే విధానాలను ఆర్థిక సర్వే చర్చించింది. ఒక కంపెనీ స్థాపనకు 4.3 ఏళ్లు పడుతోందని, ఆ సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలంది. దానర్ధం స్వేచ్ఛగా ఎలాంటి అనుమతులూ లేకుండా ఎవరైనా వ్యాపారం చేసుకొనే వెసులుబాటు కల్పించాలన్నమాట. కార్మిక చట్టాలను సరళతరం చేయడం. ఇబ్బడిముబ్బడిగా కార్పొరేట్లకు రాయితీలను, వనరులను దోచిపెట్టాలనన్నది సర్వే ఉవాచ. బిపిఒ ల విస్తరణ, ఎఫ్‌డిఐ లకు తలుపులు బార్లా, ప్రైవేటుకు రైళ్లు, రోడ్లు, పోర్టులు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, మూసివేత, ప్రైవేటీకరణ వంటి ప్రతిపాదనలను ఆర్థిక సర్వే ప్రభుత్వానికి చేసింది. ఒక వైపు ప్రైవేటు జపం చేస్తూ మరో వైపు వైద్య రంగానికి నిధులు పెంచాలనడంలో ఆంతర్యం ఆ నిధులను ప్రైవేటు కార్పొరేట్లకు సమర్పించడమే. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, ఉపాధి కల్పించడం వంటి కీలక కర్తవ్యాల ఊసే సర్వేలో ఎక్కడా లేదు. ఏతావాతా మాంద్యం, కరోనా ప్రభావాలను ప్రజలకు తాత్కాలిక బాధగా పేర్కొన్న ఆర్థిక సర్వే, కార్పొరేటీకరణే సర్వ సమస్యలకూ పరిష్కారమని బోధించింది.










