ప్రజాశక్తి- పెదబయలు :అటవీ ప్రాంతాన్ని కార్పొరేటర్ కంపెనీలకు అప్పగిస్తే ఊరుకోమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న గిరిజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స పిలుపునిచ్చారు. పెదబయలు మండలంలోని గ్రామాలు పర్యటించిన ఆయన కాఫీ రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సిపిఎం కార్యాలయంలో మంగళవారం విలేకర్లతో అప్పలనర్స మాట్లాడుతూ, అటవీ ప్రాంతాన్ని కార్పోరేట్ కంపెనీలకు అప్పగించాలని నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని కోరారు. అటవీ ప్రాంతాల సంపదను కార్పొరేట్ వ్యక్తుల పరం చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక ప్రణాళిక బద్ధంగా పని చేస్తుందన్నారు. చింతపల్లి మండలం ఎర్రవరం, అనంతగిరి మండలం పెద్దకోట, గుజ్జలి చిట్టంపాడు ప్రాంతాలలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి సుమారు 4800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు 15 వేల ఎకరాల అటవీ భూమిని ధారాదత్తం చేసేందుకు కుట్ర పూరితంగా వ్యవహరిందన్నారు. ఈ చర్యలను ప్రజా, ఉద్యోగ సంఘాలు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఐదో షెడ్యూల్ ఏరియాలోని 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టాలను దిక్కరించి గ్రామ సభలో తీర్మానం లేకుండా ఏకపక్షంగా అటవీ సంపదను కొల్లగొట్టేందుకు నరేంద్ర మోడీ, జగన్ మోహన్ రెడ్డి పూనుకోవడం సరైన చర్య కాదన్నారు. గిరిజన ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీలు ఈ ప్రయత్నాలను చూస్తూ ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారని విమర్శించారు. గిరిజన హక్కులు, చట్టాల అమల్లో ప్రజాప్రతినిధులు వారి చిత్తశుద్ధిని నిరూపించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగేళ్ల నుండి కాపీ రైతులకు సుమారు రూ.60 కోట్ల బకాయిలు చెల్లించ లేదని, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్ని దారి మళ్లించి నవరత్నాల పేరుతో గిరిజనులను తీవ్రమైన మోసం చేస్తున్నారని విమర్శించారు. కాపీ గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వం దగా చేస్తుందన్నారు. ఓ వైపు జిసిసి, మరో వైపు ప్రైవేట్ సంస్థలు కలిసి కాపీ రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారన్నారు. పాచిపెంట్ కాపీకి కిలోకు రూ. 500, చెరీ కాపీకి రూ.250లు, మిరియాలకు రూ.1000 గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాఫీ రైతులందరికీ అటవీ భూ పత్రాలు ఇవాలన్నారు. జగనన్న శాశ్వత గృహ పథకం లబ్దిదారులకు ఎక్కడా ఇంటి స్థలం చూపించలేదని, దీనికి సంబంధించిన డబ్బులు కూడా చెల్లించలేదన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నానికి ప్రజా, ఉద్యోగ సంఘాలు, మేధావులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బోండా సన్నిబాబు, పెదబయలు మండల కార్యదర్శి కొమ్మ పృథ్విరాజు, మండల కమిటీ సభ్యులు సరబన్న, బుజ్జి బాబు పాల్గొన్నారు.










