Mar 04,2021 07:06

'వాళ్లు కలలను దొంగిలిస్తున్నారు
నేనెలా ప్రశాంతంగా నిద్రపోగలను
వాళ్లు భారతదేశాన్ని అమ్మేస్తున్నారు
నేనెలా నిశ్శబ్దంగా ఉండగలను
అవును శపథం చేస్తున్నాను
నేనీ దేశాన్ని అమ్మనివ్వను.'
ఈ గీతాన్ని లయబద్ధంగా అనేకసార్లు బహిరంగ సభలలో ఆలపించారు మన ప్రధాని మోడీ. అవును, ఇది అక్షర సత్యం. 2014 ఎన్నికల ప్రచారంలో ఆ తరువాత కూడా....ప్రజలు కూడా సందర్భానుసారంగా నినాదాల ఉప్పెనలో ప్రభావితమవుతారు కదా. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం వింటూ అయోమయంలో పడ్డాను! దేశాన్ని అమ్మటానికి తీసిపోని విధంగా వందల కొద్ది ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలను అమ్మాలని మేడమ్‌ చేసిన ప్రతిపాదన అయినా తప్పయి ఉండాలి! లేదా మోడీ గీతాలాపనయినా తప్పయి ఉండాలి. కానీ పార్లమెంట్‌ సాక్షిగా చేసిన బడ్జెట్‌ ప్రసంగమే నిజం కదా? ప్రభుత్వరంగ సంస్థలను 'నూతన అభివృద్ధికి దేవాలయాలు'గా పేర్కొన్న కాలం నుంచి 'అవి చావటానికే పుట్టాయి' అనే సిద్ధాంతం దగ్గరకి చేరుకున్నాం కదా. కోర్‌ సెక్టారని వర్గీకరించిన ఆర్థిక, రక్షణ, సైన్స్‌ పరిశోధన లాంటి రంగాలలో ఒక్కొక్క రంగానికి గరిష్టంగా నాలుగు కంపెనీలు మినహా మిగిలిన నాన్‌కోర్‌ రంగానికి చెందిన 151 ప్రభుత్వరంగ సంస్థలను అమ్మటం ద్వారా రూ.1.76 లక్షల కోట్లు సంపాదించాలని ప్రతిపాదించారు. ఆర్థిక రంగంలో ఐడిబిఐ బ్యాంకును, అదనంగా రెండు బ్యాంకులను, ఒక సాధారణ బీమా సంస్థను అమ్మకానికి సిద్ధం చేశారు. పన్నులు డివిడెండ్‌ రూపంలో లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ముట్ట చెపుతున్న ఎల్‌ఐసీలో వాటాలు అమ్మాలని ప్రతిపాదించారు. ప్రభుత్వ ఆర్థిక సంస్థల అమ్మకాల ద్వారా లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి చేరాలని లక్ష్యం. ఈ అమ్మకాలకు అనుమతించే విధంగా చట్టాలను ఈ పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలలోనే మార్పు చేస్తామని కూడా ఆర్థికమంత్రి వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు ప్రగతి చక్రాలైన బ్యాంకులను, ఇన్సూరెన్స్‌ కంపెనీలను ప్రయివేటీకరించడం దేశ ఆర్థిక స్వావలంబనకు, ప్రజా ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు.
ఈ ప్రభుత్వం గత ఐదారేళ్ల కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో అనుసరించిన విధానాలను, చేసిన మార్పులను అనుసంధానం చేసుకొని పరిశీలిస్తే అసలు బండారం బయట పడుతుంది. నరసింహం కమిటీ మూడు దశాబ్దాల క్రితం చేసిన సిఫారసులను, బ్యాంక్‌ ఉద్యోగ సంఘాలతో పాటు, అనేకమంది ఆర్థిక రంగ నిపుణులు వ్యతిరేకించిన బ్యాంక్‌ మెర్జర్లను ఈ ప్రభుత్వం తలకెత్తుకుంది. మూడేళ్లలో 28 ప్రభుత్వ రంగ బ్యాంకులను 12కి కుదించింది. బ్యాంకుల విలీనాలు ప్రయివేటీకరణకు తొలి మెట్టుగా అర్ధంచేసుకున్న యూనియన్‌లు నరసింహం కమిటీ సిఫారసులను ఎండగట్టాయి. కార్పొరేట్‌ కంపెనీలకు ఆర్థిక రంగాన్ని కట్టబెట్టే పనిలో భాగంగా 10 పేమెంట్‌ బ్యాంకులకు, 11 స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులకు లైసెన్స్‌లిచ్చింది ప్రభుత్వం. రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌ తదితర కార్పొరేట్లు బ్యాంకింగ్‌ రంగంలోకి వచ్చాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ నియమించిన అంతర్గత కమిటీ ఏకంగా కార్పొరేట్‌ కంపెనీలకే వాణిజ్య బ్యాంకులు ప్రారంభించటానికి అనుమతినివ్వాలని నవంబరు 2020లో సిఫారసు చేసింది. ఇది ప్రపంచ అనుభవానికి విరుద్ధం. ఇప్పటికీ అమెరికాతో సహా అభివృద్ధి చెందిన అనేక దేశాలు కార్పొరేట్‌ కంపెనీలను బ్యాంకింగ్‌ వ్యాపారానికి దూరంగా ఉంచాయి.
భారతదేశంలో ప్రయివేటీకరణ చేసే దురుద్దేశంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు అసమర్థంగా ఉన్నాయని, నష్టాలలో ఉన్నాయని, తగిన మూలధనం సమకూర్చటానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రభుత్వ ఆరేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.9 లక్షల కోట్లకు పైగా వ్యాపార లాభాలను సంపాదించాయి. కాని ఇదే కాలంలో రూ.ఎనిమిదిన్నర లక్షల కోట్ల మొండి బాకీలు రద్దు చేసుకున్నాయి. వీటిలో 85 శాతం కొద్దిమంది కార్పొరేట్‌ కంపెనీలు చెల్లించాల్సినవే. ఏ బడా బాబుల బాకీలు రద్దు చేశారో ప్రభుత్వం పార్లమెంట్‌లో కూడా చెప్పలేదు. ఆర్టీఐ కార్యకర్తల ప్రశ్నలకూ సమాధానం ఇవ్వలేదు. చిన్న చిన్న రుణాలు వసూలు కాకపోతే మంజూరు చేసిన మేనేజర్లను, అధికారులను జవాబుదారులుగా నిర్ణయించి చర్యలు తీసుకుంటున్నారు. మరి లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసిన డైరెక్టర్లు, ఉన్నతాధికారులలో ఒక్కరిమీద కూడా చర్యలు తీసుకోలేదు. కార్పొరేట్‌ రుణాలు మంజూరు చేయటంలోగాని, వసూలు కాకపోతే రద్దు చేసుకోవటంలో కాని అధికారపక్ష నాయకులు, బ్యూరోక్రాట్లు, డైరెక్టర్లు కుమ్మక్కై చేసే తతంగమే కనిపిస్తుండటం కాదనలేని నిజం. మొండి బాకీలు ప్రతి పైసా వసూలు చేయటానికి అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపట్టాలి. ప్రజా ధనాన్ని కాపాడాలి. కానీ ఎక్కడా ఆ దాఖలాలు కనిపించవు.
కార్పొరేట్ల కోసం 'బ్యాడ్‌ బ్యాంక్‌'
ఈ బడ్జెట్‌లో చేసిన ఇంకొక కీలకమైన ప్రతిపాదన 'బ్యాడ్‌ బ్యాంక్‌' ఏర్పాటు. ఇప్పటికే గత ఆరేళ్ల కాలంలో మొండి బాకీల రద్దు రూపంలో ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం (బ్యాంకుల లాభాలు) కార్పొరేట్‌ కంపెనీలకు చేరింది. ప్రస్తుతం సుమారు పది లక్షల కోట్ల రూపాయల మొండిబాకీలు వున్నాయి. కరోనా ప్రభావంతో ఇవి సెప్టెంబరు నాటికి రూ.15 లక్షల కోట్లకు చేరుతాయని అంచనా. మరి ఇంత మొండి బాకీలున్న బ్యాంకులను ప్రక్షాళన చేసి ఎటువంటి అదనపు భారం లేకుండా కార్పొరేట్లకు సమర్పించటమే 'బ్యాడ్‌ బ్యాంక్‌' కర్తవ్యం. గుడ్‌ ఐడియా కదా?! కాబట్టి ప్రభుత్వం రూ. 20 వేల కోట్ల పెట్టుబడి పెట్టి, బ్యాంకులతో ఇంకొంత పెట్టుబడి పెట్టించి 'బ్యాడ్‌ బ్యాంక్‌'ను స్థాపించాలని ప్రభుత్వ ప్రతిపాదన. ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఉన్న రూ.15 లక్షల కోట్ల మొండి బాకీలను బ్యాడ్‌ బ్యాంక్‌'కి బదలాయిస్తారు. ఈ మొండిబాకీల బాధ్యత 'బ్యాడ్‌ బ్యాంక్‌'ది. అంటే ప్రభుత్వానిది. మొండిబాకీల బెడద లేని, నాజూగ్గా - లాభసాటిగా ప్రభుత్వ రంగ బ్యాంకులను తయారుచేసి ప్రయివేటీకరణ పేరుతో కార్పొరేట్‌ మిత్రులకు కారు చౌకగా హస్తగతం చేయొచ్చు. తరువాత మొండిబాకీలు వస్తే వసూలు చేసుకుంటూ లేకపోతే రద్దు చేసుకుంటుంది 'బ్యాడ్‌ బ్యాంక్‌'. బ్యాంకులను ప్రయివేటీకరించినా, మొండి బాకీలు రద్దు చేసుకున్నా జరిగేది ఒక్కటే. బ్యాంక్‌ డిపాజిట్ల రూపంలో ఉన్న దేశ ఆర్థిక వనరులు కార్పొరేట్లకు ధారాదత్తం చేయటమే. ఆత్మనిర్భర భారత్‌ పథకం ప్రకారం, బడ్జెట్‌లో ప్రతిపాదించినట్టుగా 'కోర్‌ సెక్టార్‌' అయిన బ్యాంకింగ్‌ రంగంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మూడో-నాలుగో ఉండాలి. వాటాల అమ్మకం, ఆస్తుల ధృవీకరణ (ఎసెట్స్‌ మానిటైజేషన్‌) ప్రయివేటీకరణ పేరేదైనా మిగిలిన ఎనిమిది లేక తొమ్మిది బ్యాంకులు కార్పొరేట్ల వశం కావటానికి ఈ బడ్జెట్‌ బాటలు వేసిందని కచ్చితంగా చెప్పొచ్చు.
ప్రభుత్వం, నీతి ఆయోగ్‌, ఫిక్కీ, అసోచామ్‌ లాంటి సంస్థలు ఒకే గొంతుతో ప్రచారం చేస్తున్న ఈ ప్రయివేటీకరణ ఎవరికి దోచిపెట్టటం కోసమో 1998-2004 మధ్య ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో చేసిన ప్రయివేటీకరణ అనుభవం తెలియజేస్తున్నది. సెంటార్‌ హోటల్‌, జుహు సెంటార్‌, విఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థలను కారుచౌకగా ప్రభుత్వం నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలకు కార్పొరేట్లు అమ్ముకున్నాయి.
బ్యాంకుల విలీనాలు, ప్రయివేటీకరణ వలన ప్రయివేటు బ్యాంకుల గుత్తాధిపత్యం ఏర్పడి సామాన్య ప్రజలు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు బ్యాంకు సేవల నుంచి దూరమవుతారు. దేశ ఆర్థికాభివద్ధి ప్రాధాన్యతలు తారుమారై కార్పొరేట్‌ కంపెనీల లాభాల కోసమే బ్యాంకులు పని చేస్తాయి. ఉద్యోగావకాశాలు, అట్టడుగు వర్గాలకు మేలుచేసే రిజర్వేషన్లు కనుమరుగవుతాయి. ప్రయివేటు బ్యాంకు దివాలా తీస్తే విదేశీ బ్యాంకులకు అప్పగించటం లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌తో మొదలయ్యింది. ప్రయివేటీకరణ తరువాత జరిగే అనివార్య పరిణామం ఇదే. మనదేశ ఆర్థిక వనరులు విదేశీ గుత్త కంపెనీల హస్తగతమవ్వటమే. అందుకు దేశ ప్రజలందరు కలసి ఈ బడ్జెట్‌ ప్రతిపాదించిన ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఓడించాలి. దేశ స్వాతంత్య్రాన్ని, ఆర్థిక స్వావలంబనను కాపాడుకోవాలి.

                              కార్పొరేట్‌ కబ్జాను అడ్డుకుందాం      పి. వెంకటరామయ్య   / వ్యాసకర్త సెల్‌: 9553533815 /