Aug 30,2020 07:28


''ఈ రోజు నుంచీ జాతీయ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ను ప్రారంభిస్తున్నాం. ఇది దేశ ఆరోగ్య వ్యవస్థలో ఒక కొత్త విప్లవం. టెక్నాలజీ తోడ్పాటుతో వైద్యసేవలను సునాయాసంగా పొందే వీలు కలుగుతుంది.'' అని ప్రధాని మోడీ ఈ ఏడాది స్వాతంత్య్ర దిన సందేశంలో ప్రకటించారు. వైద్యులను, ఆస్పత్రులను, వైద్య సేవలందించే సిబ్బందిని, ఫార్మసీ దుకాణాలను, ఇన్సూరెన్స్‌ కంపెనీలను, రోగులను డిజిటల్‌ వ్యవస్థ ద్వారా సమీకృత వ్యవస్థ లోకి తీసుకు రావడం ఈ మిషన్‌ లక్ష్యమని ప్రకటించారు. నీతి ఆయోగ్‌ సూచనల మేరకు ఆయుష్మాన్‌ భారత్‌, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఉమ్మడిగా ఈ మిషన్‌ రూపకల్పన చేశాయి. మొదట ప్రయోగాత్మకంగా దేశంలోని ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలలో దీనిని అమలు చేయనున్నారు.
ప్రతి పౌరుడికీ ఒక హెల్త్‌ ఐ.డి, వ్యక్తిగత హెల్త్‌ రికార్డు డిజిటల్‌ గా నిర్వహిస్తారు. వైద్యులు, ఆస్పత్రులు, ఫార్మసీ దుకాణాలు, టెలి మెడిసిన్‌, వంటి ఇతర భాగస్వాములకు కూడా ఇదేవిధంగా డిజిటల్‌ రికార్డులు నిర్వహిస్తారు. పౌరుడి హెల్త్‌ ఐ.డి వంటి ఒకటి రెండు మినహాయించి తక్కిన డిజిటల్‌ రికార్డులన్నింటి నిర్వహణలో ప్రైవేటు సంస్థలకు పాత్ర ఉంటుంది. ప్రైవేటు సంస్థలు ఈ డిజిటల్‌ వ్యవస్థతో సమాన ప్రాతిపదికన మిళితం అవుతాయని, తమ ఉత్పత్తులను, సేవలను మార్కెట్‌ అవసరాలకు తగినట్టు రూపొందించుకుంటాయని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ చీఫ్‌ ఇందు భూషణ్‌ ప్రకటించారు.
వైద్య రంగంలో ''సేవలందించే బాధ్యత నుండి తప్పుకుని ఆర్థిక తోడ్పాటును మాత్రమే అందించే బాధ్యతకు ప్రభుత్వం పరిమితం కావడం'' అనేది ఆయుష్మాన్‌ భారత్‌ ప్రాజెక్టు వెనుక అసలు ఉద్దేశమని కేంద్ర మాజీ హెల్త్‌ సెక్రటరీ సుజాతారావు స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక స్థాయి నుండి ప్రాంతీయ, జాతీయ స్థాయి వరకూ నిర్వహించే వైద్య సేవలను బలోపేతం చేసేబదులు, సార్వత్రిక, ఉచిత వైద్యం అందరికీ అందుబాటు లోకి వచ్చేలా విస్తరింపజేసే బదులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలకు కొంత మొత్తం చెల్లించి తమ బాధ్యత నుండి తప్పుకోడానికే ఆయుష్మాన్‌ భారత్‌ తోడ్పడుతుంది. ఇప్పుడు అదనంగా ఈ జాతీయ ఆరోగ్య డిజిటల్‌ మిషన్‌ వచ్చాక ప్రభుత్వం ఏకంగా బ్రోకర్‌ పాత్రకు పరిమితం అవుతుంది. (అ) ప్రభుత్వ వైద్య వ్యవస్థల స్థానే ప్రైవేటు వ్యవస్థలను ప్రవేశపెట్టడం, (ఆ) టెలి మెడిసిన్‌, డిజిటల్‌ ప్రిస్క్రిప్షన్ల ద్వారా ఆన్‌లైన్‌ వైద్య వ్యాపారాన్ని ప్రోత్సహించడం, (ఇ) పౌరుల వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని గోప్యంగా ఉంచేబదులు బహుళ జాతి కంపెనీలు కొత్త కొత్త మందులను ప్రయోగించడానికి వీలుగా వారికి సమాచారాన్ని అందుబాటులో ఉంచడం - ఇవే ఈ డిజిటల్‌ ఆరోగ్య మిషన్‌ లక్ష్యాలు.
''అందరికీ ఆరోగ్యం'' అన్న విధానం మన ప్రణాళికా విధానంలో భాగంగా మొదటి నుంచీ ఉంది. 1978లో ప్రపంచ ఆరోగ్య సంస్థ 2000 నాటికల్లా అందరికీ ఆరోగ్యాన్ని కల్పించడం లక్ష్యంగా ప్రకటించింది. 1983లో మన ప్రభుత్వం తొలి జాతీయ ఆరోగ్య విధానం రూపొందించింది. తర్వాత 2002 లో మరొక విధానాన్ని ప్రకటించింది. తర్వాత నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ 2005 లో చేపట్టారు. నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌ 2013లో చేపట్టారు. ప్రజారోగ్య సంరక్షణలో అంగన్వాడీ ప్రాజెక్టులకు (ఐసిడిఎస్‌), ఆశ పథకానికి ముఖ్యమైన పాత్ర ఉంది.
మోడీ ప్రభుత్వం వచ్చాక పాత విధానాల స్థానంలో 2017లో కొత్త విధానాన్ని ప్రకటించారు. ''రెండంకెల వృద్థితో దూసుకుపోతున్న ప్రైవేటు ఆరోగ్య రంగాన్ని ప్రజారోగ్య లక్ష్యాలతో మేళవించి(!) మెరుగైన, నైతికమైన(?) చౌకగా ఉండే(!) విధంగా ఆరోగ్య వ్యవస్థను పెంపొందిస్తాయని ఆ విధానంలో ప్రకటించారు. 2000 నుంచి 2017 సంవత్సరాల మధ్య మన దేశంలోని కార్పొరేట్‌ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు రు. 36,200 కోట్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించాయి. ఒక జాతీయ సర్వే ప్రకారం పట్టణాల్లో 70 శాతం ప్రజలు, గ్రామాల్లో 63 శాతం ప్రజలు ప్రైవేటు ఆప్పత్రులపైనే ప్రధానంగా ఆధారపడుతున్నారు. ఇప్పుడు ప్రజారోగ్య వ్యవస్థ ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లిస్తూ వుంటే దాని మీద ఆధారపడి నడుస్తోంది. ఈ విధానం ఇన్సూరెన్స్‌ కంపెనీలకు లాభాలను తెచ్చిపెట్టేదిగా ఉంది. ఇప్పుడు తాజాగా ప్రకటించిన డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ ఇంకో అడుగు ముందుకేసి ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన వర్తించని ప్రజానీకాన్ని కూడా కలుపుకుంటూ, ఇటు మొత్తం ప్రజలు, అటు డాక్టర్లు, ఫార్మసిస్టులు, వైద్య పరీక్షల సెంటర్లు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు అన్నింటినీ వైద్య వ్యాపార చట్రంలోకి తీసుకురానుంది.
కోవిడ్‌ా19 వ్యాపించాక మే 2020లో నీతి ఆయోగ్‌ పరిస్థితిని సమీక్షించింది. (అ) వర్క్‌ ఫ్రం హోం ను ప్రోత్సహించాలి (ఆ) విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి అవసరమైన రాయితీలు,నిర్ణయాలు చేయాలి. కార్మిక చట్టాలను సవరించడం కూడా ముఖ్యం. (ఇ) కోవిడ్‌ ా19 అనుభవాల రీత్యా టెలి మెడిసిన్‌కు గల మార్కెట్‌ను, ఇన్సూరెన్స్‌ వ్యాపారానికి గల అదనపు అవకాశాలను వినియోగించుకోవాలి. ఆ మేరకు ప్రభుత్వ వైద్య వ్యవస్థను పరిమితం చేయాలి.(ఈ) ఇాకామర్స్‌ ద్వారా ఇాఫార్మసీని, టెలి మెడిసిన్‌ ని ప్రోత్సహించాలి. ఇవి నీతి ఆయోగ్‌ చేసిన సిఫార్సులు.
ప్రజారోగ్యం పట్ల తన బాధ్యత నుండి తప్పుకోవడమే గాక ఆరోగ్యం మానవ హక్కులలో ఒకటి అన్న వాస్తవాన్ని పూర్తిగా మరుగు పరుస్తోంది మోడీ ప్రభుత్వం. వైద్యాన్ని వ్యాపార సరుకుగా చేసి ఆ మార్కెట్‌ను మొత్తంగా కార్పొరేట్ల చేతుల్లో, బహుళజాతి విదేశీ ఫార్మా కంపెనీల కబంధ హస్తాల్లో పెడుతోంది. అది చాలదన్నట్టు మన దేశ పౌరుల వ్యక్తిగత డేటాను కూడా వారికే అందిస్తూ మన గోప్యత హక్కును కాలరాస్తోంది. అది కూడా చాలదన్నుట్టు మన ప్రజలను బహుళజాతి ఫార్మా కంపెనీల ప్రయోగాలకు బలిపశువులను చేయనుంది. ఇదే జాతీయ డిజిటల్‌ ఆరోగ్య మిషన్‌ నిజ స్వరూపం.
- జె.ఎస్‌. మజుందార్‌
(స్వేచ్ఛానుసరణ)