- కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ ప్రచారభేరి
ప్రజాశక్తి-విజయవాడఅర్బన్
ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోన్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరుతూ సిపిఎం, సిపిఐ చేపట్టిన ప్రచారభేరీ పాదయాత్ర బుధవారం ఐదో రోజు చుట్టుగుంట విశాలాంధ్ర సెంటర్ వద్ద ప్రారంభమైంది. నిమ్మతోట, జమ్మిచెట్టు సెంటర్ మీదుగా భగత్‌సింగ్ గ్రంథాలయం, బందిలదొడ్డి తదితర ఏరియాల్లో ప్రచారభేరి సాగింది. కేంద్రంలోని మతోన్మాద బిజెపి, కార్పొరేట్ల అనుకూల ప్రభుత్వ విధానాలు నశించాలని, వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలని, మోడీని గద్దెదించాలంటూ నినాదాలు మారుమ్రోగాయి. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల అనుకూల విధానాలను అనుసరిస్తూ దేశ సంపదను దోచిపెడుతుందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఒక్కో కుటుంబం దగ్గర నుంచి లక్ష రూపాయల చొప్పున పన్నుల రూపంలో వసూలు చేశారన్నారు.. మోడీ ప్రభుత్వం పేదలను కొల్లగొట్టి కార్పొరేట్లకు దోచిపెట్టే దళారీగా వ్యవహరిస్తుందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేళ్ల పాలనా కాలంలో అన్ని రకాల ధరలు నింగినంటాయన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు జీవించడం కష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం పెరిగిపోయిందని, రైతులకు మద్దతు ధర లేకుండా పోయిందని అన్నారు. ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని దుయ్యబట్టారు. దేశాన్ని సర్వనాశనం చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సిపిఎం, సిపిఐ నాయకులు జి.రామన్న, పుప్పాల కృష్ణ, మురహరి, జి క్రాంతి, లంకా దుర్గారావు, డి.శ్రీనివాసరావు, నక్కా వీరభద్రరావు, గురుమూర్తి, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-కంచికచర్ల: కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని, ఇటువంటి ప్రజా వ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట కళ్యాణ్ పిలుపునిచ్చారు. బుధవారం కంచికచర్ల సిపిఎం కార్యాలయం వద్ద ప్రచారభేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సంపదని కార్పోరేట్ల పరం చేస్తూ పేద ప్రజలపై పన్నులు భారం మోపుతున్నారన్నారు. పెట్రోలు డీజిల్ ధరలు అమాంతం పెంచేసారన్నారు. నిత్యావసర సరుకులు పేద ప్రజలకు అందుబాటులో లేవన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్లకు కట్టబెడుతూ దేశ సంపదను దోచిపెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భుక్యా గోపినాయక్, జవేద, బెజ్జం భూషణం, పాలపర్తి వెంకట్రావు, బాష, మాధవ్, రాము తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-విజయవాడ రూరల్: విజయవాడ రూరల్ మండలం పి. నైనవరం గ్రామంలోని సుందరయ్యనగర్ కాలనీలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ సిపిఎం మండల కార్యదర్శి మాతంగి ఆంజనేయులు, చప్పిడి రాంబాబు, సట్టు శ్రీనివాసరావు, మాతంగి నాగమల్లేశ్వరరావు, ముగుడా సురేష్, పొలాసు నారాయణ పాల్గొన్నారు. ప్రజాశక్తి-జగ్గయ్యపేట: ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాత బిజెపిని సాగనంపి దేశాన్ని కాపాడాలని కోరుతూ పట్టణంలోని మున్సిపల్ కూడలి, ముక్యాల రోడ్డు, పెద్దమ్మ గుడి, కమల సెంటర్, కోదాడ రోడ్, క్రిస్టియన్ పేట, మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో జాతీయ ఉపాధి హామీ కూలీలకు, రైతులకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల, పట్టణ కార్యదర్శి సోమోజు నాగమణి, నాయకులు కోట కృష్ణ, దంతాల వెంకటేశ్వర్లు, రాంప్రసాద్, దాసరి నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు ఎ శివాజీ, పోతుపాక వెంకటేశ్వర్లు, నాగులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-తిరువూరు: కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో తిరువూరు పట్టణంలో ప్రచారభేరి యాత్రను నిర్వహించారు. బోసుబొమ్మ సెంటర్ నుండి మధిర రోడ్డు సెంటర్ మీదుగా బోసుబొమ్మ బస్టాప్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేకల నాగేంద్ర ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యదర్శి సీహెచ్.కోటేశ్వరరావు, జిల్లా నాయకులు డి.శంఖర్ మాట్లాడుతూ ఒకే దేశం, ఒకే పన్ను విధానం పేరుతో అన్ని వస్తువులు ధరల పెంచి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం భారాలు వేసిందన్నారు. విద్యుత్ సవరణ చట్టం తీసుకువచ్చి విద్యుత్ ప్రైవేటీకరణ చేసి విద్యుత్ ఛార్జీలు మరింత పెంచే కుట్రను కేంద్రం చేస్తుందని చెప్పారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను బిగించి ఉచిత విద్యుత్ పథకానికి క్రమంగా మంగళం పాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలన్నా రు. పంటలకు గిట్టుబాటు ధరలు అందేలా గిట్టుబాటు ధరల చట్టం తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్వీ భద్రం, ఎస్.వెంకటేశ్వర్లు, ఎం.ప్రభాకరరావు, పి.శ్రీనివాసరావు, ఆకుల రవి, సిహెచ్.సురేష్, కె.వి.రత్నం, ఎం.చింతయ్య, ఎస్.కె.మస్తాన్, శివరామకృష్ణ, సిపిఐ నాయకులు కొత్తపల్లి సుందరరావు, తూము కృష్ణయ్య, ఉదరు, ముత్తయ్య, మురళీ, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.










