
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు కార్పొరేషన్‌లో అవినీతి మూడు పువ్వులు, ఆరుకాయలుగా విరాజిల్లుతోంది. వివిధ సెక్షన్లలో పేరుకుపోయిన అవినీతిలో అధికారులు, సిబ్బంది కీలక భూమిక పోషిస్తున్నారు. రెవెన్యూ విభాగంలో ఇటీవల కాలంలో అవినీతి మరింత పెరిగింది. రిజిష్ట్రర్డ్ ఆస్తులకు పేరు మార్చాలన్నా, ఆస్తులకు పన్ను నిర్ధారించాలన్న, పలు మార్పులు చేర్పులకు ఆర్‌వోలు, ఆర్‌ఐలు భారీగా దండుకుంటున్నారు. ఇందులో పై అధికారులకు కూడా వాటాలు అందుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త తులసి రామచంద్ర ప్రభు ఆస్తికి సంబంధించి పేరు మార్పునకు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి. కార్పొరేషన్‌కు రావాల్సిన లక్షలాది రూపాయలు ఆదాయంకు నష్టం జరిగింది. ఈ వ్యవహారంలో రామచంద్ర ప్రభు నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకున్నారన్న ఫిర్యాదులపై రెవెన్యూ ఏటుకూరు ప్రాంత రెవెన్యూ అధికారి కె.రవికుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కె.ఉదరు రంగా కుమార్‌లకు కమిషనర్ చేకూరి కీర్తి మంగళవారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అదనపు కమిషనర్ పెద్ది రోజాను ఆమె ఆదేశించారు. ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఒకటో డిప్యూటీ కమిషనర్‌ను అదనపు కమిషనర్ కోరారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం గుంటూరు కార్పొరేషన్‌పరిధిలోని ఏటూకూరు గ్రామంలో పారిశ్రామిక వేత్త తులసి రామచంద్ర ప్రభుకు 2710 గజాల ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో చిన్న ఇల్లు ఉంది. ఇందుకు సంబంధించిన ఆస్తిని తన కుమార్డు కృష్ణచైతన్య పేరుతో మొత్తంఆస్తి విలువ రూ.5.42 కోట్లుగా నిర్ధారించి మొత్తం విలువలో 0.5శాతం పన్ను చెల్లించాలని అధికారులు సూచించిన మేరకు 2021లో ఏటుకూరు సచివాలయంలో దరఖాస్తు చేసి రూ. 2.71 లక్షలు కార్పొరేషన్‌కు పేరు మార్పునిమిత్తం పన్ను చెల్లించారు. ఖాళీ స్థలాన్ని కూడా పన్ను చెల్లించకుండా తాము మ్యానేజ్ చేస్తామని నమ్మించి తన వద్ద రూ.3 లక్షలు లంచం తీసుకున్నట్టు రామచంద్ర ప్రభు పేర్కొన్నారు. ఖాళీస్థలానికి గత మూడేళ్లుగా పన్ను చెల్లించకుండా కార్పొరేషన్ ఆదాయానికి రెవెన్యూ అధికారులు దాదాపు రూ.9 లక్షలు నష్టం చేకూర్చినట్టు గుర్తించిన కమిషనర్ రెవెన్యూ అధికారి కె.రవికుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కె.ఉదరు రంగా కుమార్‌లకు షోకాజ్ నోటీసులుజారీ చేశారు. 2710 గజాల స్థలంలో చిన్న ఇంటికి మాత్రం రూ.762 ఆస్తిపన్నుగా నిర్ధారించారు. రూ.3లక్షలు లంచం తీసుకుని మొత్తం ఆస్తికి పేరు మార్చకుండా 2021లో గత కమిషనర్ చల్లా అనురాధ పేరుతో అప్పటి అదనపు కమిషనర్ నిరంజన్ రెడ్డి ప్రొసీడింగ్స్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఆన్‌లైన్‌లో మార్పు చేయకపోవడం వల్ల ప్రభు కుమార్డు కృష్ణ చైతన్య బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేయగా అసలు విషయం బయటపడింది. ఈమేరకు గత నెల 28న రామచంద్ర ప్రభు మొత్తం వ్యవహారంపై కమిషనర్‌కు ఫిర్యాదుచేయగా ఆమె ప్రాథమిక విచారణ చేశారు. ప్రభు వద్ద లంచం తీసుకున్న ఆరోపణతో పాటు ఖాళీస్థలానికి పన్ను వసూలు చేయకుండా కార్పొరేషన్‌కు రూ.9 కోట్ల ఆదాయం కోల్పోయేలా చేశారని కమిషనర్ గుర్తించారు. రెవెన్యూ అధికారి,రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లపైగతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయని తెలిసింది. అయినా రాజకీయ పలుకుబడి డబ్బుతో ఇప్పటివరకు కమిషనర్లను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారని సిన్సియర్ అధికారి అయిన చేకూరి కీర్తి మొత్తం వ్యవహారంపై విచారించి ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.