ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులపై నగరంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసిపి ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకుల మధ్య లెక్కలు తేడాలు వచ్చి ఒకరు అభివృద్ధి జరిగిందంటే మరొకరు జరగలేదని చెప్పుకుంటున్నారు. నగరంలో మూడు తరహాల్లో కాంట్రాక్టర్లు ఉన్నారు. అధికారులే తమ బినామీలతో పనులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తుతున్నారు. మరోవైపు ప్రజా ప్రతినిధుల బినామీలు మరో తరహాలో కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు. వీరిరువురు కాక దీర్ఘకాలికంగా కాంట్రాక్టర్లుగా ఉన్న వారు ప్రస్తుతం మూడో కేటగిరిలో ఉన్నారు. తూర్పు నియోజకవర్గంలో గతంలో ఏదైనా పనికి 5 శాతం తక్కువ అంచనాలతో టెండర్లు వేసే వారు. కానీ రెండేళ్లుగా 10 శాతం ఎక్కువ అంచనాలతో టెండర్లు దాఖలవుతున్నాయి. అంతేగాక వాస్తవ కాంట్రాక్టర్లు మాత్రం పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని ఇటీవల కౌన్సిల్ సమావేశంలో పలువురు కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. తూర్పు నియోజకవర్గం పరిధిలో ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు కొంత మంది తమకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేయడం వల్ల ఒకేపనికి ఏడెనిమిది సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొందన్న విమర్శలు లేకపోలేదు.
దాదాపు రూ.5 కోట్లతో అభివృద్ధి చేసినట్టు చెబుతున్న గాంధీ పార్కులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో కమిషనర్ చేకూరి కీర్తి సొమ్ములు చెల్లించలేదు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ పనుల్లో ఎవరి వాటా ఎంత అన్నదీ కార్పొరేషన్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో తనకు కమిషన్ ఇవ్వకుండా పార్కు ఎలా ప్రారంభిస్తారని ఒక ప్రజా ప్రతినిధి మంకు పట్టుపట్డడంతో ప్రస్తుతం ఆధునీకరించిన గాంధీపార్కు ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. గత నెల రోజులుగా త్వరలో గాంధీ పార్కు ప్రారంభం అని పార్కు గేటు ముందు బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. ప్రస్తుతం కార్పొరేషన్‌లో కీలక వ్యక్తులనుంచి వివిధ స్థాయి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు కమిషన్లు ఇవ్వనిదే టెండర్లు దక్కించుకోలేని పరిస్థితి నెలకొంది. గత నాలుగేళ్లలో రూ.560 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. కౌన్సిల్ రాక ముందు అధికారులకు, ఒకరిద్దరు ప్రజా ప్రతినిధులకు కమిషన్లు అందేవి. ఇప్పుడు కౌన్సిల్ ఏర్పడిన తరువాత ఈ కమీషన్ల వ్యవహారం మరింత రచ్చకెక్కింది.
రెండున్నర ఏళ్లలో రూ.200 కోట్ల పనులు చేపట్టారు. వీటిల్లో ఎవరికి వారు తమ వాటా ఏమిటీ అంటూ కాంట్రాక్టర్లను గద్దిస్తున్నారు. ఇటీవల గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో సచివాలయంకు రూ.20 లక్షలు కేటాయించారు. ఇందులో వైసిపికి చెందిన నాయకులే పనులు చేస్తున్నారు. చాలాచోట్ల పనులు సరిగా చేయకుండా బిల్లులు మంజూ రు చేయాలని ఒక ప్రజాప్రతినిధి అధికారులపై వత్తిడి చేస్తున్నారు. అధికారులు ఇందుకు ససేమిరా అనడంతో అధికారులపై ఆ ప్రజా ప్రతినిధి ఆరోపణలు చేస్తున్నారని తెలిసింది. క్వాలిటీ కరట్రోలు, థర్డ్‌పార్టీ నిర్ధారణకు సంబంధించిన వారిని కూడా తమకు అనుకూ లంగా ఉన్న వారిని నియమించు కుంటు న్నారు. దీంతో అక్రమాలు బయటకురాకుం డా తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు అవినీతి సాగిపోతోంది. కమిషనర్ చేకూరి కీర్తి ఎంత నిజాయితీగా ఉన్నా గుంటూరులో ఉన్న అవినీతి తిమింగ లాల ముందు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.










