ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఆర్డర్లీ వ్యవస్థలో గుంటూరు నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికులు, కార్యాలయ సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నగరంలో పారిశుధ్యం మెరుగుదలకు వినియోగించాల్సిన వందలాది మంది పారిశుధ్య కార్మికులు, ఇతర ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అధికారులు, ప్రజా ప్రతినిధుల సేవకు పరిమితం అవుతున్నారు. మేయర్ వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, బదిలీ అయిన మాజీ కమిషనర్‌లతో పాటు శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ల స్థాయిలోనూ ఇళ్లల్లో నగరపాలక సంస్థ సిబ్బంది పనిచేస్తున్నారు. కొంత మంది జిల్లా ఉన్నతాధికారుల బంగ్ళాల్లో కూడా మున్సిపల్ పారిశుధ్య కార్మికులను వినియోగించుకుంటున్నారు.
గుంటూరు నగర పాలక సంస్థలో అధికారిక లెక్కల ప్రకారం 2153 మంది పారిశుధ్య కార్మికులున్నారు. వీరిలో 340 మంది శాశ్వత కార్మికులు, 1813 మంది ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా నియామకం పొందారు. గుంటూరు నగరంలో 133 నోటిఫైడ్ పేదల వాడలున్నాయి. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య మెరగుదలకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు సంబంధిత వర్కర్లను తమ ఇళ్లల్లో పనిచేయించుకోవడం, పారిశుధ్యం అధ్వానంగా ఉండటానికి సిబ్బంది కొరతను సాకుగా చూపడం పరిపాటైంది. ఒక్కో ఇంట్లో ఒకరు కంటే ఎక్కువ మంది కార్మికులను వ్యక్తిగత పనుల కోసం వినియోగించుకుంటున్నారు. గరిష్టంగా నలుగురు ఒకే ఇంట్లో పనిచేస్తున్న పరిస్థితులూ ఉన్నాయి. పలువురు శానిటేషన్ వర్కర్లను కార్పొరేషన్ కార్యాలయంలోనే అటెండర్లుగా వినియోగించుకుంటున్నారంటే పారిశుధ్యంపై ఉన్న అధికారులకు ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతుంది. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులే కాదు... పారిశుధ్య విభాగంలో పనిచేసే ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు కూడా ఇళ్లల్లో పనులు కేటాయించడం గమనార్హం. మొత్తంగా 200 మంది పారిశుధ్య పనుల్లో కాకుండా ఇతరుల వద్ద పని చేస్తున్నారని సమాచారం.
రాష్ట్రంలో ఏ కార్పొరేషన్‌లో లేనంతమంది వర్కర్లు గుంటూరులో ఉన్నారని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. దీంతో కొత్త నియామకాలకు కమిషనర్ అనుమతి ఇవ్వడం లేదు. కార్పొరేషన్‌లో ఇష్టానుసారంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమిస్తున్నారు. ఎటువంటి నోటిఫికేషన్లు లేవు. రాత పరీక్షలు ఉండవు. ఎవరికి నచ్చిన వారిని వారు ఎంపిక చేసుకుని కార్పొరేషన్ నుంచి వేతనాలు చెల్లిస్తున్నారు. రెండున్నర ఏళ్ల క్రితం నూతన కౌన్సిల్ ఏర్పాటైన తర్వాత దాదాపు 110 మందిని నియమించారు. వీరిలో సగం మంది ఎక్కడ పని చేస్తున్నారో కూడా అధికారులకు అంతుబట్టడం లేదు. జీతాలు మాత్రం కార్పొరేషన్ నుంచి ఇస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కమిషనర్ చేకూరి కీర్తి కొంతమంది ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా జీతాలిచ్చే ఏర్పాటు చేశారు. 50 మందికి పైగా అనధికారికంగా సిఫార్సులపై ఉత్తర-దక్షిణలతో నియామకం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కొంత కాలంగా కార్పొరేషన్‌లో అడ్డగోలుగా ఔట్ సోర్సింగ్ నియామకాలు జరుగుతున్నాయి. వీరికి విద్యార్హత, నిబంధనల ప్రకారం వయస్సు, ఉద్యోగాన్ని బట్టి ఉండాల్సిన చదువు, అనుభవం వంటి ప్రమాణికాలు కూడా పాటించలేదనే విమర్శలున్నాయి. ఈ అంశంపై కమిషనర్ విచారణ చేస్తున్నట్టు తెలిసింది.










