అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఒకటవ నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నాడు నగరపాలక కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కార్యాలయం వద్దకు సిపిఎం నాయకులు, కార్యకర్తలు చేరుకుని ధర్నాకు దిగారు. కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేశారు. సిపిఎం నగర నాయకులు ప్రకాష్, వలీ, వెంకటనారాయణ, మసూద్, ముస్కిన్, రాజు, బాలకష్ణ, ఎన్టీఆర్ శీనా, గపూర్, ఎస్‌కె.మహమ్మద్, ఆటో శివ, నాగరాజు, కుమార్, అమీర్, షర్మాస్, షరీఫ్, లక్ష్మీదేవి పద్మావతి, వరలక్ష్మి, మాబున్నీ, షబానా ఫక్రుని తదితరులను అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. అంతకుముందే సిపిఎం ఒకటవ నగర కార్యదర్శి రామిరెడ్డిని ఇంటి వద్దనే అరెస్టు చేసి మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కౌన్సిల్ మీట్ ముగిసిన అనంతరం సిపిఎం నాయకులను పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ నగర పాలకవర్గం సమస్యలను పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో విఫలం అయ్యిందన్నారు. సమస్యలను పరిష్కరించాలని అడుగుతున్న తమను పోలీసుల ద్వారా అరెస్టు చేయించడం దుర్మార్గం అన్నారు. నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో పలుమార్లు అధికారులు, పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయినా వారి నుంచి ఎలాంటి స్పందనా లేదన్నారు. టవర్‌క్లాక్ దగ్గర ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ బందెల దొడ్డి కంటే అధ్వానంగా ఉందన్నారు. బాడుగల రూపంలో కోట్లాది రూపాయలు వస్తున్నా దాని అభివృద్ధి కోసం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అనంతపురం నగరం విస్తీర్ణంకు అనుగునంగా కార్మికుల సంఖ్యను పెంచాల్సుందన్నారు. చెత్త పన్నును రద్దు చేసి, ఇళ్ల గుత్తలు తగ్గించాలన్నారు. వీధి కుక్కలు, పందులు, పశువులను వెంటనే అనంతపురం నగరం నుంచి దూరంగా తరలించాలన్నారు. సెంట్రల్ పార్కును కాపాడి సుందరీకరణ చేయాలన్నారు. టిడ్కో ఇళ్లను పూర్తి చేసి వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న నడిమి వంక రక్షణ గోడులు, నడిమి వంక, పెద్ద వంక, మరువ వంక పూడికతీత పనులను చేపట్టాలన్నారు. తిక్క రంగయ్య స్వామి గుడి నుంచి తపోవనంకు వెళ్లే దారిని బాగు చేయాలన్నారు. ఈ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.










