
టెక్కలి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆనుసరిస్తున్న విద్యా కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధి హక్కుల కోసం ఉద్యమించాలని పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు యు.గనిరాజు విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్థానిక ఉన్నత పాఠశాల మైదానంలో పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.వినోద్‌కుమార్ అధ్యక్షతన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) జిల్లా 12వ మహసభ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ నూతన విద్యా విధానం వల్ల విద్యారంగాన్ని కార్పొరేటీకరణ చేయడంతో పాటు రాష్ట్రాల ఫెడరల్ హక్కులను కాలరాస్తుందని ఆన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ విద్యార్థుల ఫీజు రియంబర్స్‌మెంట్ దూరం చేసి జారీ చేసిన జిఒ 77ను రద్దు చేయాలన్నారు. విశాఖ ఉక్కు పోరాటానికి, కార్మికులకు పిడిఎస్‌యు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎపిటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి వై.సూర్య ప్రకాశరావు మాట్లాడుతు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం అలవడాలని సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు. డిటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు కోత ధర్మారావు మాట్లాడుతూ విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో నిధులు శాతం పెంచాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమెక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాదవరావు, సునీల్, మహేష్, జీవన్, రాజేష్, ధర్మారావు పాల్గొన్నారు. అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.