Sep 21,2023 23:42

ప్రైవేటు క్లాసులో విద్యార్థులు

ప్రజాశక్తి - కారంపూడి : ఒక్క రూపాయి తీసుకోకుండా విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రభుత్వ పాఠశాలలో ట్యూషన్‌ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. వీటిని చెల్లించలేక పేదలైన విద్యార్థుల తల్లిదండ్రులు నానా అవస్థ పడుతున్నారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామని, కార్పొరేట్‌ పాఠశాలకు తీసిపోని విధంగా సదుపాయాలు, విద్యనందిస్తున్నామని ఒకవైపు ప్రభుత్వం ప్రకటిస్తుంటే మండల కేంద్రమైన కారంపూడి జెడ్‌పి పాఠశాలలో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. స్థానిక బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థుల నుండి కామన్‌ ట్యూషన్‌ పేరుతో రూ.3 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. పాఠశాల ముగిసిన తర్వాత ప్రత్యేక తరగతులు నిర్వహణ కోసం వీటిని వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. పదో తరగతిలో 75 మంది వరకూ ఉండగా ఒక్కొక్కరి వద్ద రూ.3 వేల చొప్పున తీసుకుంటున్నారు. దీనిపై హెచ్‌ఎంను వివరణ కోరగా నిజమేనని, అంగీకరించడంతోపాటు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా చదువు చెబుతున్నారని, విద్యార్థుల్లో భయం, బాధ్యత పెంచడానికి తీసుకోవడం తప్పేమిటని ఎదురు ప్రశ్నించడం గమనార్హం. దీనిపై మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగా డబ్బుల వసూలు విషయం తమ దృష్టికి రాలేదని, ఒకవేళ వసూలు చేస్తున్నట్లుయితే తప్పని చెప్పారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.