Oct 16,2023 00:45

మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు

ప్రజాశక్తి-ఉక్కునగరం : కార్మికవర్గంపై కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి చేస్తున్న దాడిని ఐక్యంగా ఎదుర్కొనేందుకు కార్మికులు సిద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు పిలుపునిచ్చారు. ఉక్కునగరంలోని స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా కార్మిక వర్గంపై దాడి చేస్తోందన్నారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అంబానీ, అదానీలకు కట్టబెట్టే విధానం అమలు చేస్తోందని తెలిపారు. కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మార్చుతోందన్నారు. కార్మికులకు వేతనాలు తగ్గించడం, ఉపాధికి రక్షణ లేకుండా చేయడం వంటి దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రం చేసే చట్టాలు, విధానాలను రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం వ్యతికించకపోగా వాటి అమలుకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో టిడిపి, జనసేన కూడా బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. హిందూత్వ కార్పొరేట్‌ విధానాలపై కార్మికవర్గాన్ని చైతన్యం చేసే విధంగా పనిలో మార్పు రావాలని పేర్కొన్నారు. నవంబర్‌లో జరిగే మహాపడావ్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉత్తరాంధ్ర నాయకులు కెఎం.శ్రీనివాసరావు, ఆర్‌.శంకరరావు, కాకి సురేష్‌, ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, అమ్మన్నాయుడు, ఉమామహేశ్వరరావు, మన్మధరావు పాల్గొన్నారు.