ప్రపంచ చరిత్రలో తొలి కార్మిక వర్గ రాజ్యమైన పారిస్ కమ్యూన్ నూటయాభయ్యవ వార్షికోత్సవం మానవ ప్రస్థానంలో మరవరాని ఘట్టం. తాము మాత్రమే పాలించగలమన్న దోపిడీ వర్గాల దురహంకారానికి చరిత్ర ఇచ్చిన తొలి సమాధానం పారిస్ కమ్యూన్. మహా మహోపాధ్యాయులైన మార్క్స్, ఎంగెల్సుల కాలంలోనే వారి మౌలిక భావాల విజయానికి తొలి సంకేతంగా ఆవిర్భవించి అమూల్యమైన పాఠాలు అందించింది పారిస్ కమ్యూన్. అది ప్రపంచ చరిత్ర పరిణామ క్రమంలో కార్మికోద్యమ వికాస గతిలో సంభవించిన విప్లవమే తప్ప యాదృచ్ఛికం కాదు. పారిస్ కమ్యూన్ నూటయాభయ్యవ వార్షికోత్సవం సమయంలో ఆ చరిత్ర ఒక్కసారి రేఖామాత్రంగా దర్శిద్దాం. జేజేలర్పిద్దాం.
ఐరోపా, అమెరికాలలో పెట్టుబడిదారీ విధానం సాధించిన అభివృద్ధి 19వ శతాబ్ది ద్వితీయార్ధంలో సామాజికాభివృద్ధికి ప్రాతిపదిక అయింది. అన్ని రకాలైన భారీ ఫ్యాక్టరీలు వెలిశాయి. సమాచార సంబంధాలలో కొత్తగా 'టెలిగ్రాఫ్' ప్రవేశించింది. 1859లో ఛార్లెస్ డార్విన్ జీవపరిణామాన్ని కనుగొన్నాడు. అయితే 1857లో అమెరికా, ఐరోపాలు తొలిసారిగా అధికోత్పత్తి అనే సంక్షోభం ఎదుర్కొన్నాయి. ఆనాటికి అత్యధికంగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశం బ్రిటన్. అయితే ప్రజల పరిస్థితుల్లో తీవ్రమైన వ్యత్యాసాలు ఉండేవి. ఫ్యాక్టరీ యజమానులు, బ్యాంకర్లు, నౌకాధినేతలు భూస్వాములు అపార సంపదలు పోగుపోసుకుంటుంటే, కార్మికులు, ఇతర సామాన్య ప్రజలు దుర్భర జీవితం గడిపేవారు. రైతాంగం పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. వలస దేశాల్లో ప్రజల బాధలు సరేసరి.
19వ శతాబ్దిలో అమెరికాలో పెట్టుబడిదారీ విధానం చాలా వేగంగా పెరిగింది. అయితే ఉత్తర భాగంలో పరిశ్రమలు, పశ్చిమంలో వ్యవసాయం వృద్ధి చెందాయి. దక్షిణాన మాత్రం ఇంకా బానిస విధానం సాగుతుండేది. పేద రైతు కుమారుడు, నిష్కళంక ప్రజాతంత్రవాది అబ్రహం లింకన్ 1861లో దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఈ ఘర్షణ అంతర్యుద్ధంగా మారింది. దక్షిణాదిన గల బానిస యజమానులు దేశం నుంచి విడిపోయి, ప్రత్యేక సమాఖ్యగా ఏర్పడ్డారు. 1861-1865 మధ్య ఈ రెండు పక్షాల మధ్య భీషణ సంగ్రామం జరిగింది. ప్రజలు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకంగా పోరాడే సైన్యంలో చేరారు. 1863 చివరి నుంచి బానిసలకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తూ లింకన్ చట్టం తెచ్చాడు. 1865 నాటికి దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా ఓడిపోయాయి. ఇది అమెరికా చరిత్రలో మరో విప్లవం. ఆ తర్వాత 4 రోజులకే ఏప్రిల్ 14న లింకన్ హత్యకు గురయ్యాడు.
బ్రిటన్‌లో వలెనే ఇతర చోట్ల కూడా పారిశ్రామికాభివృద్ధి కార్మికవర్గం పెరగడానికి దారితీసింది. బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, జర్మనీలలో ట్రేడ్ యూనియన్లు ఆవిర్భవించాయి. సమ్మెల సంఖ్య పెరిగింది. సోషలిస్టు గ్రూపులు, బృందాలు ఏర్పడసాగాయి.1864 సెప్టెంబర్ 28న లండన్‌లో అంతర్జాతీయ కార్మిక సంస్థ అవతరించింది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ తదితర దేశాల వారు దానిలో పాల్గొన్నారు. మార్క్స్, ఎంగెల్సు ఉద్యమ ప్రధాన నాయకులుగా, మార్గదర్శకులుగా వున్నారు. శాస్త్రీయ కమ్యూనిజం సూత్రాలను చెబుతూనే, కార్మికులను ఐక్యపరిచే విధంగా మార్క్స్ పత్రాలు రూపొందించారు. రాజకీయాధికార స్వాధీనమే కార్మికుల ప్రథమ కర్తవ్యంగా ముందుకు వచ్చిందని తెలిపారు. దురాక్రమణ యుద్ధాలను ప్రతిఘటించాల్సిందిగా కార్మికులకు పిలుపునిచ్చారు. మరోవైపు మార్క్స్ 1867లో 'పెట్టుబడి' మొదటి సంపుటి పూర్తిచేశాడు. ఇదే కాలంలో ఇటలీ ఏకీకరణ జరిగింది. అనేక ఆటుపోట్ల తర్వాత 1870 చివరిలో ఏకీకరణక్రమం పూర్తయింది. జర్మనీ మాత్రం అప్పటికీ ఐక్యంకాలేదు. పైన బూర్జువా వర్గాలు, దిగువన కార్మికవర్గం కూడా ఏకీకరణ కోరుకున్నాయి. మార్క్సు అనుయాయుడు విల్‌హెల్మ్ లీబ్‌ఖ్నెట్ ఆగస్ట్ బెబెల్, వంటి కార్మిక నాయకులు అందుకోసం పోరాటం నడిపారు. అయితే వారికి కార్మికుల్లో మద్దతు పరిమితంగానే వుండేది. ఫెర్సినాండ్ లాసెల్లీ అనే కార్మిక నాయకుడికి ఎక్కువ పలుకుబడి వుండేది. ప్రష్యన్ నియంత బిస్మార్క్ నాయకత్వంలో జర్మనీ ఏకీకరణ జరగాలని లాసెల్లీ కోరుకున్నారు. ఈ సమస్యపై 1870-71లో ఫ్రాన్స్-ప్రష్యన్ యుద్ధం కూడా జరిగింది. దుర్భలమైన మూడవ నెపోలియన్, నాయకత్వంలోని ఫ్రెంచి సైన్యం. 1870 సెప్టెంబర్ 2న లొంగిపోయింది. ఆగ్రహించిన పారిస్ ప్రజానీకం మరో రెండు రోజుల్లో ప్రభుత్వాన్ని కూలదోసింది.
ప్రష్యన్ సైన్యం దిగ్బంధనంలో పారిస్ ప్రజలు ఆరు మాసాలపాటు వీరోచితంగా పోరాడుతూనే వున్నారు. తిండి దొరకని స్థితిలో కూడా, స్త్రీలు, పిల్లలు సహితం ధైర్యంగా నిలబడ్డారు. కాని ఆనాడు అధికారంలో వున్న లూయీ అడాల్ఫ్ థేర్స్ కీలుబొమ్మ ప్రభుత్వం వారికి అండనివ్వకపోగా, వ్యతిరేక చర్యలకు పాల్పడింది. ఫ్రెంచి కార్మికులు, నేషనల్ గార్డ్స్ అనే సైనికులు చందాలు వేసుకుని ఏర్పాటు చేసిన ఫిరంగిని వెనక్కు తీసుకు వచ్చేందుకు 1871 మార్చి 18న థేర్స్ ప్రభుత్వం సైన్యాన్ని పంపింది. దాంతో ఒక్కసారిగా విప్లవం ప్రజ్వరిల్లింది. ముఖ్యంగా మహిళల ప్రేరణతో సైనికులు, ప్రజలు, సైనికులకు ఎదురు తిరిగారు. థేర్స్ వర్సయిల్స్ పారిపోయాడు. పారిస్ అధికార కేంద్రమైన హోటల్ డీవిలాపై ఎర్రజెండా ఎగిరింది. ఆ మరుసటి రోజే వేలాదిమంది పారిస్ కార్మికులు వీధుల్లోకి వెల్లువగా వచ్చారు. ధనవంతులు, భూస్వాములు వర్సయిల్స్‌కు పారిపోయారు. చరిత్రలో మొదటిసారిగా పారిస్‌లో 1871 మార్చి 21న కార్మికవర్గం అధికారం హస్తగతం చేసుకుంది. ఆ పోరాటం పరిస్థితిని బట్టి అప్రయత్నంగా ప్రజ్వరిల్లిందే.
ప్రష్యా దురాక్రమణను అసమర్థుడైన నెపోలియన్ చక్రవర్తిగాని, తర్వాత వచ్చిన థేర్స్ బూర్జువా తొత్తు ప్రభుత్వం గాని గట్టిగా ఎదుర్కోలేని స్థితిలో పారిస్ ప్రజలు చొరవ తమ చేతుల్లోకి తీసుకుని ఆ పాలకులను తోసివేశారు. ప్రష్యాను ఎదుర్కొనేందుకు ఏర్పరిచిన నేషనల్ గార్డు, అది ఎన్నుకున్న కేంద్ర కమిటీ ఇందుకు నాయకత్వం వహించాయి. థేర్స్ ప్రభుత్వం ప్రజలపైకి తుపాకులు మళ్ళించిన తర్వాత సెంట్రల్ కమిటీ రాజకీయాధికారాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకుంది. ఆ విధంగా చరిత్రలో కార్మికవర్గ తొలి విప్లవ ప్రభుత్వమేర్పడింది. దీనిలో ప్రముఖులంతా కార్మికులే. కార్మికులు, వృత్తిదారులు, చిత్రకారులు, రచయితలు కూడా కేంద్ర కమిటీ సభ్యులుగా వున్నారు. కార్మికవర్గ పోరాటాలను పక్కదారి పట్టించే సిద్ధాంతకర్తలు కూడా కొందరు దానిలో చోటు సంపాదించారు. పారిస్ కమ్యూన్ చేపట్టిన తొలి చర్య - ప్రజా కంటక ప్రభుత్వ అధీనం లోని సైన్యాన్ని రద్దు చేయడం. కార్మికవర్గాధికారాన్ని సహించలేని బూర్జువాలు, కులీనుల ప్రేరణపై అధికార వర్గాలు అన్ని బాధ్యతలు వదలిపోయారు. కాని కార్మికవర్గం బెదిరిపోకుండా మరింత ధైర్యంతో అన్ని బాధ్యతలు తానే చేపడుతున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ కమిటీ సభ్యులైన కార్మికులు, విద్యార్థులు, జర్నలిస్టులు, వృత్తిదారులు ప్రభుత్వశాఖల నిర్వహణ చేపట్టారు. అనుభవం లేకపోయినా విప్లవోత్సాహం, దీక్షలతో స్వల్పకాలంలోనే విప్లవ ప్రభుత్వం అన్ని విభాగాలను పని చేయించగలిగింది. పారిస్ కమ్యూన్‌కు ఎన్నికలు జరుగుతాయని సెంట్రల్ కమిటీ మొదటే ప్రకటించింది.
మార్చి 26న సార్వత్రిక ఓటింగుతో ఎన్నికలు జరిగాయి. మార్చి 28న అశేష ప్రజల సమక్షంలో హోటల్ డేవిలా భవనంలో పారిస్ కమ్యూన్ అధికారం స్వీకరించింది. పారిస్‌కే పరిమితంగాకుండా మొత్తం ఫ్రెంచి రిపబ్లిక్‌కు వర్తించేలా అది ఎన్నో ప్రగతిశీల శాసనాలు చేసింది. థేర్స్ తొత్తులైన విద్రోహ అధికారులను పూర్తిగా తొలగించి, కొత్తవారిని ఎంపిక చేసి నియమించింది. ప్రభుత్వాధికారులు కూడా ప్రజల నుంచి ఎన్నిక కావాలని ఆదేశించింది. అలాంటి విప్లవాత్మక చర్యలు గతంలో ఎవరూ తీసుకోలేదు. ఆ చర్యల పూర్తి ప్రాధాన్యత, ప్రభావం కమ్యూన్ నాయకులకే సంపూర్ణంగా తెలియదు. మార్క్స్, ఎంగెల్సులు మాత్రమే ఆవిషయం అర్థం చేసుకున్నారు. కార్మికవర్గ నాయకత్వానికి తొలి ఉదాహరణగా పారిస్ కమ్యూన్‌ను ఆయన పరిగణించాడు. కాని అది ఆ దిశలో ఒక ప్రయత్నం మాత్రమే. దాని నాయకులకు తగినంత అవగాహన లేకపోవడమేగాక వారు పరిస్థితులు ఎటు నడిపిస్తే అటు నడిచారు. అయినాసరే-కార్మికవర్గం బూర్జువా అధికార యంత్రాంగాన్ని నాశనం చేయగలదని, చేయాలని, ఆ స్థానంలో మరింత ఉన్నతమైన యంత్రాంగాన్ని ప్రవేశ పెట్టాలని పారిస్ కమ్యూన్ నిరూపించింది. కమ్యూన్ అధికారం చేపట్టిన మరుసటి రోజే రాజకీయ ఖైదీలను విడుదల చేసింది. తాకట్టు వస్తువుల అమ్మకాన్ని నిషేధిస్తూ, 15 ఫ్రాంకుల లోపు విలువగల వస్తువులను వెంటనే వాటి స్వంతదార్లకు ఇచ్చేయాలని ఆదేశించింది. కౌలు చెల్లించనందుకుగాను భూముల నుంచి తొలగించడాన్ని నిషేధించింది. పేదలకు 10 లక్షల ఫ్రాంకులు భత్యంగా చెల్లించే ఏర్పాటు చేసింది. యజమానులు వదిలివెళ్ళిన పరిశ్రమలను కార్మికులకు, ఉత్పత్తిదార్ల సమాఖ్యలకు అప్పగిస్తూ ఒక చట్టం తెచ్చింది. బూర్జువాలు వదిలిపోయిన ప్లాట్లను యుద్ధంలో ఇళ్ళు కోల్పోయినవారికి, ఇళ్ళు లేనివారికి కేటాయించింది. చర్చిని, ప్రభుత్వాన్ని వేరుపరుస్తూ చట్టం చేసింది. ప్రజలకు విద్యా సౌకర్యం పెంచే చర్యలు చేపట్టింది.
ఇన్ని మహత్తర చర్యలు తీసుకున్నప్పటికి పారిస్ కమ్యూన్ నాయకులు చేసిన పలు విధాలైన పొరబాట్లు బూర్జువాలకు వరప్రసాదమయ్యాయి. థేర్స్ అనుకూల సైనికులు పారిస్ నుంచి వర్సెయిల్స్ తరలివెళ్ళకుండా అడ్డుకోకపోవడం మొదటి తప్పిదం. చేజిక్కిన అధికారంతో వర్సెయిల్స్‌పై దండయాత్ర జరిపి థేర్స్‌ను పూర్తిగా లొంగతీసుకోకుండా ఉదాసీనత వహించడం రెండో తప్పిదం. ఈ అవకాశం తీసుకుని ఆ శక్తులు మళ్లీ సమీకృతం కాగలిగాయి. ఇతర పట్టణాలలో కూడా కమ్యూన్లు ఏర్పడినప్పటికి వాటిని సంఘటితపరచాల్సిన అవసరాన్ని గుర్తించలేదు. పారిస్ మిగిలిన దేశం నుంచి విడగొట్టబడిన స్థితిలో రైతాంగం మద్దతు కూడగట్టుకోవలసిన అవసరాన్ని అర్థం చేసుకోలేదు. కొద్దిపాటి నిధుల కోసం తప్ప ఆర్థికశక్తికి కేంద్రమైన బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్‌ను కమ్యూన్ స్వాధీనం చేసుకోనేలేదు. మరోవంక థేర్స్ ఆ బ్యాంకు నిధులు బాగా ఉపయోగించుకున్నాడు. ఈ పొరబాట్లు, లోపాలు, తప్పు అంచనాలకు చారిత్రక కారణాలున్నాయి. పారిస్ కార్మికులకు నాడు వున్న అనుభవం, పరిమితి అంతే. పైగా పెట్టుబడిదారీ విధానం అభివృద్ధికి నాటికి ఇంకా అవకాశాలున్నాయి. కార్మికోద్యమం కొంత పెరిగినా, సామాజిక సూత్రాల గురించి, పోరాటం గురించి దానికి సంపూర్ణమైన అవగాహన లేదు. ఈ నేపథ్యంలో థేర్స్ ప్రభుత్వం నెమ్మదిగా కూడగట్టుకుని, ఏప్రిల్ రెండో భాగంలో పారిస్ పై దాడి ప్రారంభించింది. కమ్యూనార్డులు ఎంతో వీరోచితంగా పోరాడినా పరిస్థితులు వారికి ప్రతికూలంగా వున్నాయి. ఆఖరుకు థేర్స్ వారిని అణచివేసేందుకు నిర్లజ్జగా బిస్మార్క్‌కు లొంగిపోయాడు. మే 22న సైన్యాలు పారిస్‌లో ప్రవేశించాయి. 28కి యుద్ధం ముగిసిపోయింది. ఓడిపోయిన కార్మికులను బూర్జువాలు ఘోర హింసలకు గురిచేశారు. ఎందరో వీరులను విచారణ లేకుండా కాల్చి చంపారు. ఆ మారణకాండలో 17 వేల నుంచి 30 వేల మంది వరకు చనిపోయి వుంటారని రకరకాల అంచనాలు తెల్పాయి. వేలకు వేల మందిని అరెస్టు చేసి న్యూ కెలడోనియాలో భయానక చాకిరీ శిక్ష విధించారు. 72 రోజులలోనే ఓటమిపాలైనా పారిస్ కమ్యూన్ ప్రపంచ విప్లవోద్యమ చరిత్రలో ఉజ్వల ఘట్టంగా నిలిచిపోయింది.
సువ్యవస్థితంగా ఏర్పడిన సోవియట్, తూర్పు యూరోప్ లలోనే సోషలిజం విచ్ఛిన్నమైనపుడు అత్యంత ప్రాథమిక రూపంలో ఆవిర్భవించిన కమ్యూన్ కుట్రలకు గురవడంలో ఆశ్చర్యం లేదు. ఏమైనా అది కార్మికవర్గ చైతన్యపు తొలి మెరుపు. ఎరుపు.
/'వెయ్యేళ్ల చరిత్ర' నుంచి/
* తెలకపల్లి రవి










