ప్రజాశక్తి - వన్‌టౌన్
కార్మికులు, ప్రజలు సంఘటితమై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు తెలిపారు. శుక్రవారం పాతబస్తీ 50 డివిజన్ వించిపేటలో పి. దివాకర్ 19వ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా దివాకర్ చిత్రపటానికి సిహెచ్ బాబురావు, సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పళ్ళు పంపిణీ చేశారు. పేదలకు అల్పాహారం అందించారు. అనంతరం బాబూరావు, బోయి సత్యబాబులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుపై మోడీ జవాబు చెప్పాలన్నారు. అదాని, అంబానీ, కార్పొరేట్ల అనుకూల విధానాలే ఆర్థిక సంక్షోభాలకు మూలమన్నారు. కార్మిక చట్టాలను, కార్మిక శాఖలను నిర్వీర్యం చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికుల భద్రతను విస్మరించిన ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే పరిశ్రమల్లో ప్రమాదానికి కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అప్పులపై మోడీ సుద్దులు చెప్పటం కాదు, 8 ఏళ్లలో 70 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ ప్రభుత్వం పారదర్శకత లేకుండా, అవినీతి, అస్తవ్యస్త పాలనతో ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తోందన్నారు. కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చి అదానీ వంటి సంస్థలకు దోచిపెట్టడం వల్లే దేశం ఆర్థికంగా సతమతమవుతోందన్నారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించి మోడీ తన గొప్పలు చెప్పుకోవడం తగదన్నారు. దివాకర్ సుదీర్ఘ కాలం పాటు విజయవాడ నగరంలో ప్రజలకు సేవలు అందించారని, కార్మికులను కూడగట్టారు మత సమరస్యాన్ని పరిరక్షించడానికి ఆవిరళ కృషి చేశారని కొనియాడారు. వారి స్ఫూర్తితో కార్మిక, ప్రజా ఉద్యమాలను పెంపొందించాలని కోరారు. ఈ కార్యక్ర మంలో సిపిఎం నేతలు సూరిబాబు, పిళ్ళా రాంబాబు, గాదె ఆదిలక్ష్మి, కొండారెడ్డి, సుబ్బారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.










