ప్రజాశక్తి - ఎటపాక
సమస్యలపై అన్ని రంగాల కార్మికులు సంఘటితంగా పోరాటం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ పిలుపునిచ్చారు. ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) మండల రెండవ మహాసభ బుధవారం ఎటపాకలో జరిగింది. ఈ మహాసభలో అంగన్వాడీ యూనియన్ మండల అధ్యక్షులుగా తలారి వీరమ్మ, కార్యదర్శిగా బండారు సూర్యకుమారి, కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వెంకట్ మాట్లాడుతూ కార్మిక చట్టాలను, హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ తీసుకొచ్చిందని తెలిపారు. వాటిని కేంద్రం ఉపసంహరించుకునే వరకు కార్మికులంతా ఐక్యంగా పోరాడాలన్నారు. అంగన్వాడీ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వాటిని సాధించే వరకు పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు జి.హరినాథ్, యూనియన్ నాయకులు మాధవి, కుమారి, రాణి, వెంకట రమణ, స్రవంతి, మణీశ్వరమ్మ, జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.










