Jul 06,2023 23:13

కంపెనీ ఎదుట నిర‌స‌న తెలుపుతున్న కార్మికులు

ప్రజాశక్తి - మేడికొండూరు : కార్మికులు లౌకిక స్ఫూర్తిని పెంపొందించుకోవాలని, ఐక్యంగా పోరాడి హక్కులను సాధించుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సంఘం (డివైఎఫ్‌ఐ) జిల్లా కన్వీనర్‌ కృష్ణకాంత్‌ అన్నారు. మండలంలోని పేరేచర్లలో కార్మికులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బిజెపి తన పాలనలోని లోపాలను విమర్శిస్తున్న వారిపై అనేక రూపాల్లో కేసులు, వేధింపులకు పాల్పడుతోందని, సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చడానికి, తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల మధ్య మత చిచ్చు పెడుతోందని విమర్శించారు. ఏడాదికి రూ.16 లక్షల కోట్లను ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేస్తూ రూ.12 లక్షల కోట్లను కార్పొరేట్‌ శక్తులకు రాయితీలు, రుణ మాఫీలు చేస్తోందని మండిపడ్డారు. కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక హక్కులను నాలుగు లేబర్‌కోడ్‌లుగా మార్చి నిర్వీర్యం చేయబూనుకుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజలు, కార్మికులు బిజెపి చేస్తున్న విద్వేష ప్రచారాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, లైకిక, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కలిగి ఉండాలని అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు, భారాలకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌ఎం బాషా, నికు ఆగ్రో ఆయిల్‌ కంపెనీ కార్మికుల సంఘం నాయకులు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
యాజమాన్యం మొండివైఖరి వీడకుంటే సమ్మె
మండలంలోని పేరేచర్ల నికో ఆగ్రో ఆయిల్‌ కంపెనీ వద్ద కార్మికుల చేస్తున్న నిరసన గురువారం 16వ రోజుకు చేరింది. తమ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో కార్మికులు నిరసనను కొనసాగిస్తున్నారు. సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌ఎం బాష మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించే వరకూ ఉద్యమిస్తామని చెప్పారు. యాజమాన్యం మొండివైఖరిని విడనాడకుంటే సమ్మెకూ వెనకాడబోమన్నారు. నిరసనలో శ్రీనివా స్‌రెడ్డి, మీరాసాహెబ్‌, బాబు, వెంకటేశ్వర్లు, షేక్‌ బాజీ షరీఫ్‌ పాల్గొన్నారు.