Oct 09,2023 23:57

కార్యదర్శితో మాట్లాడుతున్న దుర్గాప్రసాద్‌

ప్రజాశక్తి -ఐ.పోలవరం
ఐ.పోలవరం గ్రామ పంచాయతీలో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలనంటూ సిఐటియు జిల్లా కార్యదర్శి జి.దుర్గాప్రసాద్‌ కోరారు. ఈ పంచాయతీలో ఐదేళ్లుగా పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న కాశి వరలక్ష్మి, మహేష్‌, పల్లాలమ్మ, యలమంచిలి సత్యవతి, దడాల నాగమణిని ఇటీవల తొలగించారు. విషయం తెలుసుకొన్న ఆయన పంచాయతీ కార్యాలయంకు వఛ్చి సెక్రటరీని వివరాలు అడిగి తెలుసుకొన్నారు. సర్పంచ్‌ దంతులూరి రాఘవరాజుతో ఫోన్‌లో మాట్లాడారు. పంచాయతీలో నిధులు కొరత వల్ల కార్మికులు తొలగిస్తున్నామని సర్పంచ్‌ చెప్పడాన్ని ఆయన వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం 14ఆర్థిక సంఘం నిధుల ద్వారా కార్మికులకు జీతాలు ఇవ్వాలని ఆదేశాలున్నాయన్నారు. అయినప్పటికీ కార్మికులను తొలగించడం సరైంది కాదన్నారు. కరోనా సమయంలో పారిశుధ్య కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహించారని గుర్తు చేశారు. కార్మికులను తొలగించడం చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విధుల్లో తీసుకోవాలన్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి గోవిందుకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పాము బాలయ్య, సిఐటియు మండల కార్యదర్శి టి.నాగలక్ష్మి, ముమ్మిడివరపు సుబ్బారావు ఉన్నారు