Sep 25,2023 20:51

నిరసన ర్యాలీ చేస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు

ప్రజాశక్తి- గరివిడి : డిఎప్‌ఎన్‌లోని ఆక్సైడ్‌ ప్లాంట్‌ మూసివేతకు యాజమాన్యం ప్రభుత్వ అనుమతి కోసం లెటర్‌ ఇవ్వడం దుర్మార్గమని సిఐటియు నాయకులు అన్నారు. కార్మికులను రోడ్డుపైకి నెట్టొద్దని సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు గరివిడి డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు అంబళ్ల గౌరినాయుడు, జె. విశ్వనాథరాజు మాట్లాడుతూ ఈ ప్లాంట్‌లో పనిచేస్తున్న 110 మంది కార్మికులను తీసివేయాలని యాజమాన్యం ప్రయత్నిస్తుందన్నారు. ప్రభుత్వానికి యాజమాన్యం పెట్టిన మూసివేత దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించాలని, కార్మికుల కుటుంబాలను రోడ్డున పడకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. ఇందులో భాగంగా అనంతరం గరివిడి బ్రిడ్జి నుంచి తహశీల్దార్‌ ఆఫీస్‌ వరకు కార్మికులతో నిరసన ప్రదర్శన చేసి వినతి పత్రాన్ని అందించారు. కార్మికులు పాల్గొన్నారు.