ప్రజాశక్తి-పాడేరు:రోజు రోజుకి పెరిగి పోతున్న నిత్యావసర ధరలను దృష్టిలో ఉంచుకుని కార్మికులకు వేతనాలు పెంచాలని సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్ చేశారు. ఆదివారం పాడేరులో సిఐటియు మండల మహాసభ కాంతమ్మ సోందేవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో దానికి అనుగుణంగా సగటు కార్మికుల జీతభత్యాలు పెరగ లేదన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు పెంచకపోగా కార్మికులకు కట్టు బానిసలుగా చేస్తున్నాయన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు పెంచవలసింది పోయి కుదించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. డిసెంబరు 20, 21న నూతనంగా ఏర్పడిన అల్లూరీ జిల్లాలో కార్మిక మహాసభలు జరుగుతున్నాయని, వీటిని కార్మికులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సుందర్‌రావు, జిల్లా కోశాధికారి నాగరాజు పాల్గొన్నారు.










