ప్రజాశక్తి-హుకుంపేట:కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దీసరి గంగరాజు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో బుధవారం మండల మహాసభ నిర్వహించారు. ముందుగా కార్మికులతో స్థానిక కార్యాలయం నుంచి మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దీసరి గంగరాజు మాట్లాడుతూ, కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపుచూస్తున్నాయన్నారు. కార్మికులతో ప్రభుత్వాలు వెట్టిచాకిరి చేయిస్తున్నాయని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇచ్చి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు.భాషా వాలంటీర్లను రెన్యూవల్ చేయాలని హుకుంపేట మండలం వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు డిమాండ్ చేశారు. కార్మికుల చట్టాలు ప్రభుత్వాలు ఉల్లంఘించడం సరికాదన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఎన్నో సేవలు అందించిన కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్.హైమావతి ఆధ్వర్యంలో సిఐటియు మండల మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వి.లక్ష్మణరావు, నాయకులు టీ.అప్పలకొండ పడాల్, అప్పారావు, గిరిజన సంఘం అధ్యక్షులు కార్యదర్శులు టి.కృష్ణారావు, కే.రామారావు, మాజీ సర్పంచ్ లక్ష్మీ ప్రమీల, ప్రజా సంఘం నేతలు, అంగన్ వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ వర్కర్స్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










