- కలెక్టరేట్ ఎదుట ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు
రాయచోటి టౌన్ : గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, ఎన్‌ఎంఆర్ సిబ్బందికి బకాయి వేతనాలు విడుదల చేయాలని సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని టెండర్లు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ పంచాయతీ, స్వచ్ఛభారత కార్మికులను పర్మినెంట్ చేయాలని, పెండింగ్ జీతాలివ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్ల తో కూడిన వినతి పత్రం కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీ కార్మికులు పోరాడి సాధించుకున్న 57, 132, 680 జిఒలను అన్ని జిల్లాలలో అమలు చేయాలన్నారు.రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు జీవో నెంబర్ 132 ప్రకారం పిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని తెలిపారు. ప్రభుత్వం ఆదేశాలు ఉన్నా అమలు చేయలేదని స్వచ్ఛభారత్ కార్మికులకు కూడా పిఎఫ్, ఇఎఫ్‌ఐ అమలు చేయాలని జీవో నెం 680 ప్రకారం ప్రతి కార్మికుడికి రూ.పది వేల వేతనం ఇవ్వాలని కోరారు. ఆరు నెలల నుంచి 18 నెలల వరకు ఉన్న బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.సురేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులకు టెండర్లతో సంబంధం లేకుండా విధుల్లో కొనసాగించాలని తెలిపారు. కార్మికులకు 2015లో హైకోర్టు తీర్పును అన్ని జిల్లాలలో అమలు చేయాలని ఆదేశాలు ఉన్నా అమలు చేయడం లేదాని పేర్కొన్నారు. కలెక్టర్, డిపిఒ, స్పందించి వెంటనే గౌరవ హైకోర్టు ఇచ్చిన సర్కులర్ అన్ని జిల్లాలలో అమలు చేయాలని టెండర్ పద్ధతి లేకుండా విధుల్లో కొనసాగించాలని కోరారు. టెండర్ విధానం రద్దు చేయాలని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, పోరాటాలను ఉధతం చేస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు బి.శేఖర్ నాయక్, గోపాల్, ప్రమీల, శ్యామల, శంకర్, రెడ్డెయ్య, నాగమ్మ, ఆనంద్, శరమంద, కొండయ్య, రామాంజులు, నాగరాజు, సాయి, ఈశ్వరి, ఓబులేసు, అశోక్ పాల్గొన్నారు.










