
ప్రజాశక్తి - భట్టిప్రోలు
అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు నెలకు రూ.26వేలు కనీస వేతనం ఇవ్వాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి డిమాండ్ చేశారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో శుక్రవారం జరిగిన సిఐటియు మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. స్కీం వర్కర్లుగా ఉన్న అంగన్వాడి, ఆశ, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించకుండా, రాష్ట్ర ప్రజలను నిలువన నమ్మించి మోసం చేసిన బీజేపీని ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. నల్ల చట్టాలు తెచ్చి భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తూ తీవ్ర నిర్బంధాలు ప్రయోగించి ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గపు చర్యలపై ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని అన్నారు. గ్యాస్ రూ.400లకే ఇవ్వాలని, పెట్రోల్, డీజిల్ లీటరు రూ.60లకే ఇవ్వాలని కోరారు. ఒక యూనిట్ విద్యుత్తు ఒక రూపాయికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన విద్య, వైద్యం, త్రాగునీరు అందించాలని అన్నారు. సామాజిక న్యాయం, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలు చేయాలని అన్నారు. కుల గణన చేయాలన్నారు. వివక్షపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సబ్ ప్లాన్ అమలు చేయాలని కోరారు. దళితులకు రక్షణ, జస్టిస్ పున్నయ్య కమిటీ సిఫార్సులు అమలు చేయాలన్నారు. డప్పు, చర్మకారులు, కళాకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ, రిజర్వేషన్ అమలు, మతసామరస్యం, రంగనాథ్ మిశ్రా కమిటీ సిఫారసులు అమలు చేయాలని కోరారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ బేరి యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 15న విజయవాడలో జరిగే బహిరంగ సభకు ప్రజలు హాజరు కావాలని కోరారు. సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పోలీస్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హాజరవుతారని తెలిపారు. సమావేశానికి సిఐటియు మండల కార్యదర్శి జి సుధాకర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి కృష్ణమోహన్, ఎం సత్యనారాయణ, పి మనోజ్ పాల్గొన్నారు.