Jul 28,2023 01:44
కమిషనర్‌ రామచంద్రారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-చీరాల: కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న ముఠా కార్మికుల కూలి రేట్లు పెంచి వారి సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద చీరాల నెహ్రూ కూరగాయల మార్కెట్‌ ముఠావర్కర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కార్యదర్శి వసంతరావు మాట్లాడుతూ రోజు 12 గంటలు పని చేస్తున్నారని ఇచ్చే కూలి ఎనిమిది గంటలకు ఇస్తున్నారన్నారు. 3 సంవత్సరాలు పూర్తయినా కూడా కూలీల అగ్రిమెంటు విషయంలో యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్లో రాత్రిపూట నిద్ర లేకుండా పనిచేసి చేసి చీరాల పట్నానికి కావలసిన కూరగాయలు అందిస్తూ శ్రమ చేస్తున్న కూలీలకు కూలి రేట్లు పెంచకపోవడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ కమిషనర్‌ జోక్యం చేసుకొని కూలి రేట్ల పెంపుదలకు కృషి చేయాలని కోరారు. జూన్‌ 9వ తేదీ కూరగాయల మార్కెట్‌ వర్తక కమిషన్కు డిమాండ్స్‌ నోటీసు కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఈ తరుణంలో వారి సమస్యను పరిష్కరించాలని కోరుతూ చీరాల మార్కెట్‌ దగ్గర నుంచి ర్యాలీ నిర్వహించారు. చీరాల కమిషన్‌ ఆఫీస్‌ ముందు ధర్నా చేసి కమిషనర్‌ రామచంద్రారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. గడియార స్తంభం సెంటర్లో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు ఎన్‌ బాబురావు, పి కొండయ్య, మార్కెట్‌ ముఠా యూనియన్‌ అధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.