
ప్రజాశక్తి-మాడుగుల:గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్‌లు, ఎలక్ట్రీషియన్ లకు పెండింగ్‌లో ఉన్న జీతాలు తక్షణం చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.శంకరరావు, దేముడు నాయుడు, ఏపి గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.నరసింహమూర్తి డిమాండ్ చేశారు. మాడుగుల మండలంలో కార్మికులు చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు పడుతుండగా, వీరికి కొద్ది నెలలుగా జీతాలు అందలేదని, దీంతో ఈ కుటుంబాలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురి అవుతున్నాయని తెలిపారు. టెండర్ విధానం రద్దు చేసి ప్రభుత్వం నేరుగా జీతాలు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చినా, ఎక్కడా అమలు కాలేదన్నారు. పంచాయతీ నిధులు ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని తెలిపారు. కార్మికులకు బూట్లు, తువ్వాలు, చీపుర్లు, గ్లౌజులు ఇవ్వలేదని, తోపుడు బండ్ల మరమ్మత్తులు కూడా చేయలేదని విమర్శించారు. ఎంపీడీఓ మీనా కుమారికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు అప్పారావు, ఈశ్వరరావు, కామరాజు తదితరులు పాల్గొన్నారు.