మదనపల్లె అర్బన్ : గ్రామ పంచాయతీ కార్మికులకు ఇపిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని ఎపి గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు డి.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. స్థానిక డిఎల్‌పిఒ కార్యాలయంలో ఎపి గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు 2012 నుంచి ఇపిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని ఆదేశాలు ఉన్నా అమలు చేయలేదన్నారు. 2019లో జిఒ నెంబర్ 57, 132లలో ఇపిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని, బ్యాంక్ ద్వారా తీరాలు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నా ఇప్పటి వరకు మదనపల్లె రూరల్ గ్రామ పంచాయతీలలో కార్మికులకు ఎవరికి అమలు చేయలేదన్నారు. గతంలో డిఎల్‌పికి చాలా పర్యాయములు నోటీసు ఇచ్చామని ఇంత వరకు అమలు చేయలేదన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు 2015లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా పక్కన పెట్టి కార్మికుల దగ్గర శ్రమ దోపిడీ చేయించుకుంటూ, కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా చాలా అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా మదనపల్లె డివిజన్ పంచాయతీ అధికారి స్పందించి అన్ని గ్రామ పంచాయతీలలోని కార్మికులకు ఇపిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని, లేనిపక్షంలో ఈ నెల10వ తేదీ నిర్వధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. డిఎల్‌పిఒ నాగరాజుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎపి గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సురేంద్ర, ప్రధాన కార్యదర్శి నాగరాజు, సిఐటియు మండల అధ్యక్షులు వెంకటేష్, గోపాలు, నరసింహులు, రంగస్వామి, రవి, ప్రమీల పాల్గొన్నారు.










