మోడీ ప్రభుత్వం పార్లమెంటు వానాకాలపు సమావేశాలలో మందబలంతో లేబర్ కోడ్ బిల్లులను ఆమోదింపజేసుకుంది. ఈ సమావేశాలలోనే వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులు కూడా ఆమోదం పొందాయి. అటు పొలాల్లో, ఇటు ఫ్యాక్టరీల్లో తమ శ్రమతో సంపదను సృష్టించే కార్మిక, కర్షక జనావళిని యావత్తూ 19వ శతాబ్దం లోని దుర్భర పరిస్థితులకు తిరిగి నెట్టే చట్టాలు ఇవి. దేశ ప్రజానీకాన్ని అత్యంత క్రూరంగా దోపిడీ చేయడానికి ఆనాడు పరాయి పాలకులు పూనుకుంటే ఈనాడు మనం ఎన్నుకున్న స్వదేశీ పాలకులే అటువంటి దుర్మార్గానికి ఒడిగట్టారు.
దాదాపు 150 సంవత్సరాల నుండీ కార్మికులు పోరాడి కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పని ప్రదేశంలో రక్షణ, పనిగంటలు, సంక్షేమం, సమాన పనికి సమాన వేతనం వంటి అత్యంత న్యాయమైన డిమాండ్లకు చట్టబద్ధ రూపం కల్పించుకున్నారు. కాని నయా ఉదారవాద విధానాలు మొదలయ్యాక దేశ, విదేశీ కార్పొరేట్లకు ఈ సంక్షేమ చట్టాలే కంటగింపు అయ్యాయి. యధేచ్ఛగా యజమానులు కార్మికులను దోచుకునేందుకు ఎటువంటి చట్టపరమైన ఆటంకాలూ లేకుండా చేసేందుకే బిజెపి ప్రభుత్వం ఈ లేబర్ కోడ్‌లను అత్యంత అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకుంది. పారిశ్రామిక సంబంధాల పైన, పని పరిస్థితులు, ఆరోగ్యం పైన, సామాజిక భద్రత పైన మూడు కోడ్ లను రూపొందించారు. ఈ కోడ్‌లు అంతకు ముందున్న కార్మిక చట్టాల స్థానే వచ్చిన కొత్త చట్టాలు. కార్మిక సంక్షేమం కోసం రూపొందించినవే ఈ కోడ్‌లు అని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇటువంటి చట్టాలు కావాలని ఏ కార్మిక సంఘమూ అడగలేదు సరికదా వీటిని అందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించారు. ఈ తరహా చట్టాలు కావాలని పట్టుబట్టినది, ఒత్తిడి చేసిందీ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులే. అందుకే ఈ లేబర్ కోడ్‌లలో లేబర్ యొక్క రక్షణ లేకపోగా యజమానుల సంక్షేమమే వ్యక్తమవుతోంది.
వీటి ముసాయిదాలను 2019 లోనే ప్రతిపాదించారు. అప్పుడే అన్ని కార్మిక సంఘాలూ పూర్తిగా తిరస్కరించాయి. అయితే ఇప్పుడు చట్ట రూపంలో మారేనాటికి ఇవి 2019లో ప్రతిపాదించిన దానికన్నా మరో అడుగు ముందుకేసి మరింత కార్మిక వ్యతిరేకంగా తయారయ్యాయి. ముసాయిదాలో 100 మంది వరకూ కార్మికులున్న పరిశ్రమల్లో ఎటువంటి ముందస్తు అనుమతీ లేకుండానే మూసివేయడం గాని, లే-ఆఫ్ చేయడం గాని, ఉద్యోగాల నుండి తొలగించడం గాని చేయవచ్చునని ఉంది. ఇప్పుడు ఆ 100 కాస్తా పోయి 300 మంది వరకూ పరిమితి విస్తరించింది. దీనితో దాదాపు ప్రైవేటు రంగం లోని పరిశ్రమలన్నీ కార్మిక చట్టాల అమలు నుండి మినహాయింపు పొందినట్టే అయింది. ఇదిగాక, 'ప్రజా ప్రయోజనాల' రీత్యా కేంద్ర ప్రభుత్వం ఏ పరిశ్రమనైనా కార్మిక సంక్షేమ చట్టాల అమలు నుండి మినహాయించవచ్చు. ప్రభుత్వ యంత్రాంగానికి కొత్త చట్టాలు అపార అధికారాలను కల్పిస్తున్నాయి. పి.ఎఫ్, ఇఎస్‌ఐ వంటి సదుపాయాల విషయంలో అధికారులు నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయాలపై కార్మికులు అప్పీలు చేయడానికి వీలు లేకుండా చేశారు. మరోవైపు ఈ సదుపాయాలను అమలు చేయవలసిన యజమానులు తప్పు చేస్తే విధించే జరిమానాలను గణనీయంగా తగ్గించారు.
కాంట్రాక్టు పద్ధతిన నియామకాలు నివారించాలని, శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలని పాత చట్టాలు నిర్దేశిస్తే, ఈ కొత్త లేబర్ కోడ్‌లు కాంట్రాక్టు నియామకాల పరిధిని మరింత విస్తరించేందుకు అనుమతిస్తున్నాయి. శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో, కీలకమైన పనుల్లో సైతం కాంట్రాక్టు నియామకాలకు పచ్చ జెండా ఊపుతున్నాయి.
ఈ లేబర్ కోడ్‌ల కార్మిక వ్యతిరేక స్వభావం ఎంత తీవ్రమైనదో వాటిపై వస్తున్న ప్రతికూల స్పందనలే తెలియజేస్తున్నాయి. చివరికి బిజెపి కి అనుకూలంగా ఉండే బిఎంఎస్ కూడా 'ఈ బిల్లులు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను సాధించే బదులు ఈజ్ ఆఫ్ క్లోజింగ్ బిజినెస్ ను మాత్రమే సాధిస్తాయి' అని నిరసించింది. నానాటికీ తీవ్రమౌతున్న సంక్షోభ కాలంలో కార్మికుల నెత్తిన మోపిన బండలే ఈ లేబర్ కోడ్‌లు. వీటికి వ్యతిరేకంగా కదులుతున్న కార్మిక వర్గానికి యావత్తు ప్రజానీకమూ అండగా నిలవాలి. కార్మిక హక్కులు నిలబడితేనే ప్రజాస్వామ్యానికి మనుగడ.










