Oct 18,2023 23:12

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: కార్మికులందరికీ దసరా సందర్భంగా బోనస్‌ ఇవ్వాలని సిఐటియు నాయకలు డిమాండ్‌ చేశారు. ఇబ్రహీంపట్నం సిఐటియు కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో బోనస్‌ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బోనస్‌ చట్టం 1965 ప్రకారం ప్రతి కంపెనీలో పర్మినెంట్‌, క్యాజువల్‌, కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ యాజమాన్యాలు బోనస్‌ చెల్లించాల్సి ఉందన్నారు. లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా యాజమాన్యాలు నెల జీతం (8.33 శాతం) బోనస్‌ కార్మికునికి చెల్లించాలన్నారు. యాజమాన్యాలు బోనస్‌ను చెల్లించకపోతే చెల్లించమని కార్మికులందరూ డిమాండ్‌ చేయాలని, ఈ విషయంలో కార్మికులకు సిఐటియు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షురాలు ఎన్‌సిహెచ్‌ సుప్రజ, ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి ఎం.మహేష్‌, విటిపియస్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు వేముల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.