May 08,2023 00:15

మేడే సాంస్కృతిక సంబరాల్లో మాట్లాడుతున్న సిపిఎం కార్పొరేటర్‌ గంగారావు

ప్రజాశక్తి-తగరపువలస: 'అమ్మ ఒడి, ఆసరా తదితర పథకాల కోసం మీరు వేసే నిధుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు, కార్మికులకు స్వయంగా వారే బటన్‌ నొక్కే శక్తిని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వ విధానాలుండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు సూచించారు. తగరపువలస జంక్షన్‌లో సిఐటియు భీమిలి జోన్‌ కమిటీ ఆధ్వర్యాన ఆదివారం మే డే సాంస్కృతిక సంబరాలు ఆద్యంతం ఉత్సాహ పూరితంగా సాగాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో గంగారావు మాట్లాడుతూ, కరోనా కష్టాల నుంచి ఇంకా కోలుకోని ప్రజలపై కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు ఆస్తి పన్ను పెంచి, చెత్త పన్ను విధించి, ఆర్టీసి ఛార్జీలు, విద్యుత్‌ ఛార్జీలు, వంట గ్యాస్‌ ధర పెంచి భారం మోపాయని ధ్వజమెత్తారు. చిట్టివలస జ్యూట్‌ మిల్లును తెరిపించడంలో తెలుగు బిడ్డగా మీ పౌరుషం ఏమైందని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే హక్కు ఎవరిచ్చారని తెలుగు వారిగా ప్రధాని నరేంద్ర మోడీని జగన్మోహన్‌ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించి, నిలేసే ధైర్యం చెయ్యలేక పోతున్నారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధపడాలని కార్మిక వర్గానికి పిలుపు నిచ్చారు. కార్మికుడు సృష్టిస్తున్న సంపదకు సరిపడా వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వాలు ముందుకు రావడం లేదని వాపోయారు. కనీస వేతనం ఇవ్వని యాజమాన్యాలను జైలులో పెట్టాలని డిమాండ్‌ చేశారు.
ఉద్యోగ భద్రత కోసం ఉద్యమం
ఉద్యోగ భద్రత కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ కార్మిక వర్గానికి పిలుపు నిచ్చారు. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు, ఎమ్మెల్యే, ఎంపీల జీతాలు పెరుగుతున్నాయని, కార్మికుల వేతనాలు మాత్రం పెరగడం లేదన్నారు. బిజెపి ప్రభుత్వం దేశ భక్తి ముసుగులో ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను కార్పొరేట్లకు అమ్మేస్తోందని విమర్శించారు. సంపద సృష్టి కర్తలైన కార్మికులను విస్మరించిన ఏ ప్రభుత్వాలూ ఎక్కువ కాలం అధికారంలో ఉండలేవని స్పష్టంచేశారు. సిఐటియు భీమిలి జోన్‌ అధ్యక్షులు ఆర్‌ఎస్‌ఎన్‌.మూర్తి అధ్యక్షతన జరిగిన సభలో కార్యదర్శి రవ్వ నరసింగరావు, యూనియన్‌ నాయకులు ఎస్‌.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎరుపెక్కిన వీధులు...
ముందుగా సిఐటియు కార్యాలయం వద్ద ప్రారంభమైన కార్మిక ప్రదర్శన జంక్షన్‌ మీదుగా పట్టణ పుర వీధుల్లో సాగింది. అనంతరం సభాస్థలికి చేరింది. ఆశా, అంగన్వాడీ, ముఠా, ఆటో, క్వారీ తదితర రంగాల కార్మికులు అధిక సంఖ్యలో ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఆద్యంతం ఉత్సాహంగా కళా ప్రదర్శనలు..
జానపద, డప్పు కళాకారులు, ప్రజానాట్య మండలి కళాకారులు పాడిన విప్లవ, అభ్యుదయ గీతాలు ఆద్యంతం స్థానికుల్లో చైతన్యం నింపాయని చెప్పవచ్చు. గురజాడ నాటిక ఆలోచింప జేసింది. భీమిలి మండలం ఆశిపాలెం కళాకారులు ప్రదర్శించిన తప్పెట గుళ్ళు, టి.నగరపాలెం కళాకారులు ప్రదర్శించిన కోలాటం, ఉత్తరాంధ్ర జానపద కళాకారులు బొట్టా తవుడు పాడిన జాన పద గీతాలు ఎంతో ఆలోచింప జేశాయి. ప్రజానాట్య మండలి కళాకారులు పంపాన సూర్య నారాయణ, దల్లి రాంబాబు పాడిన అభ్యుదయ గీతాలు ఆలోచింపజేసాయి.