Sep 12,2022 23:57

హెచ్‌ఆర్‌ ఈడీకి వినతిపత్రం అందిస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ కార్మికులకు పెరిగిన లాభాలకనుగుణంగా బోనస్‌/ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని స్టీల్‌ సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె.అయోధ్యరామ్‌, వైటి.దాస్‌ యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. బోనస్‌/ఎక్సిగ్రేషియా, వేతన ఒప్పందం అమలు అంశాలను వివరిస్తున్న వినతి పత్రాన్ని స్టీల్‌ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ఈడి (హెచ్‌ఆర్‌) కె.శ్రీనివాస్‌కు ఆయన కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా అయోధ్యరామ్‌ మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో కూడా అంకితభావంతో పనిచేసిన కార్మికులను ప్రోత్సహించడం యాజమాన్యం ప్రధాన కర్తవ్యమన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.28,250 కోట్ల రికార్డు టర్నోవర్‌తో పాటు రూ.942 కోట్లు లాభాలు వచ్చాయని గుర్తు చేశారు. 474 టన్నుల ఉత్పాదకత సామర్థ్యం కలిగిన సెయిల్‌ కార్మికులను, 535 టన్నుల ఉత్పాదకత సామర్థ్యాన్ని సాధిస్తున్న ఉక్కు కార్మికులను ప్రోత్సహించడం యాజమాన్యం కర్తవ్యంగా భావించాలని పేర్కొన్నారు. వైటి దాస్‌ మాట్లాడుతూ, ఉన్నత యాజమాన్యం నూతన వేతన ఒప్పంద అమలులో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. సెయిల్‌ కార్మికులకు నూతన వేతన ఒప్పందాలతో పాటు, వారికి ఎరియర్స్‌ కూడా చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టీల్‌ సిఐటియు నాయకులు బి.అప్పారావు, యు.రామస్వామి, నీలకంఠం, బి.మహేష్‌, కె.సత్యనారాయణ, వి.ప్రసాద్‌ పాల్గొన్నారు.