కేంద్రం తీరుపై సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు
రెండోరోజు కొనసాగిన సిఐటియు జిల్లా మహాసభ
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుని దానిని కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు అన్నారు. మహిళా ఉద్యమనేత, సిఐటియు నాయకురాలు జి.విజయలక్ష్మి నగర్ (కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపం)లో నిర్వహిస్తున్న సిఐటియు జిల్లా మహాసభలో రెండోరోజైన ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి కార్మికులను కేంద్ర ప్రభుత్వం మోసగించిందన్నారు. పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులు, అమలవుతున్న చట్టాలు అన్నీ యజమానులకు అనుకూలంగా మారిపోయాయన్నారు. ఎనిమిది గంటల పని విధానం 12 గంటలకు మార్చాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం కేంద్రం ప్రభుత్వ అడుగు జాడల్లో నడుస్తోందన్నారు. కేంద్రం విధానాలను తుచ తప్పకుండా అమలు చేస్తోందని విమర్శించారు. నూతన విద్యావిధానం, లేబర్ కోడ్‌లు, విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలపై ఛార్జీల భారం ఇలా అన్ని అంశాల్లో రాష్ట్రం బిజెపి చెప్పినట్లు చేస్తుందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకింగ్, టెలికాం, విద్యుత్ వంటి వాటిని ప్రయివేటీకరించిందని, బీమా, రైల్వే, విమానయానం, కోల్, పోస్టల్, రక్షణ రంగాలు సైతం ప్రయివేటీకరిస్తుందని తెలిపారు. ఆఖరికి ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు అనే నినాదంతో ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని అడ్డుకోకపోగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోడీ విశాఖపట్నం వచ్చినప్పుడు సాదర స్వాగతం పలికి, ఆయన చెప్పిన కల్లిబొల్లి కబుర్లకు తలాడించిందని విమర్శించారు. ఒకే దేశం ఒకే పన్ను అంటూ బిజెపి ప్రభుత్వం జిఎస్‌టి పేరుతో ప్రజలపై మోయలేని భారం మోపిందన్నారు. ఆహార పదార్థాలపై కూడా పన్ను వేసిన ఘనత నిర్మలమ్మకే చెందుతుందన్నారు. సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చింతకాయల బాబూరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, ఉద్యోగ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. సభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.స్వరూపరాణి, కార్యదర్శి ఆర్‌వి.నరసింహారావు తదితరులు మాట్లాడారు. రెండోరోజు మహాసభలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రతినిధులు వివిధ అంశాలపై నిర్వహించిన చర్చల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.సోమయ్య, డిఎన్‌విడి ప్రసాద్, నేతలు ఆర్.లింగరాజు, పి.కిషోర్, వి.సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.










