ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
భవననిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వాలు వాడుకున్న నిధులను తిరిగి బోర్డుకు జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్‌టియు అనుబంధ ఎపి ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఐఎఫ్‌టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవననిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. బిఒసి బోర్డులోని కార్మికుల నిధులను కాజేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిలిపివేసిందని, వాటిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు పరిరక్షణ కోసం భవిష్యత్తులో కార్మికవర్గం మరింత సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నానుద్దేశించి ఇఫ్టూ అనుబంధ ఎపి ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ రంగ, కార్మిక సంఘం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అద్యక్షులు కెవి.రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకటరావులు మాట్లాడుతూ కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా 1996లో కేంద్ర ప్రభుత్వం బిఒసి చట్టం చేసి, బోర్డులు ఏర్పాటుచేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించిందని తెలియజేశారు. ఎపిలో 2009లో ఈ బోర్డు ఏర్పడిందని, 2018 వరకూ సంక్షేమ పథకాలు అమలు జరిగాయని వివరించారు. ఆనాటి టిడిపి ప్రభుత్వం, ఈనాటి జగన్ ప్రభుత్వం బోర్డు నిధులు రూ.కోట్లు పక్కదారి పట్టించారని తీవ్రంగా విమర్శించారు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును, కార్మికుల సంక్షేమ పథకాలను కొనసాగించాలనీ, కార్మికులందరికీ పిఎఫ్, ఇఎస్‌ఐ, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో దశలవారీగా పోరాడుతామనీ, కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు పి.నాగేశ్వరరావు, ఎండివి.ప్రసాద్, ఇ.గ్రీష్మ కుమార్, ఎం.నాగరాజు, ఎర్రా శ్రీను, కాకర్ల శ్రీను పాల్గొన్నారు.










