Aug 22,2023 19:54

మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డికి వినతిపత్రం అందిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికుల సంక్షేమ బాధ్యత కమిషనర్‌ తీసుకోవాలని సిఐటియు తాలూకా కార్యదర్శి బి.రాముడు, ఎఐటియుసి తాలూకా కార్యదర్శి తిమ్మగురుడు, ఐఎఫ్‌టియు తాలూకా కార్యదర్శి కె.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం మున్సిపల్‌ కార్మికులతో ర్యాలీ నిర్వహించి, మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. మున్సిపల్‌ కార్మికులు ఏళ్ల తరబడి పని చేస్తున్నా పిఎఫ్‌, ఈఎస్‌ఐ సొమ్ముకు భద్రత లేకుండా పోయిందన్నారు. మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం వల్ల కార్మికులకు పిఎఫ్‌ నెంబర్‌ కేటాయించడం లేదని, జాయినింగ్‌ రిపోర్టు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కేవలం ట్యాబ్‌లెట్లు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఏదైనా అనారోగ్యంతో మృతి చెందితే కార్మికుల అంత్యక్రియలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదన్నారు. మరణించిన కార్మికుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం లేదని తెలిపారు. 8 మంది కార్మికులు మృతి చెందారని, వైసిపి ప్రభుత్వంలో మృతుల కుటుంబాలు రోడ్డు పాలయ్యాయని వాపోయారు. కార్మికులకు సాధారణ, మెడికల్‌ సెలవులు ఇవ్వాలన్నారు. వీరి భద్రతను కమిషనర్‌ చూసుకోవాలన్నారు. కార్మిక సంఘ నాయకులు ఎస్‌.రాజు, యు.వీరేష్‌, నాగరాజు, బి.ఎల్లప్ప, కె.ప్రతాప్‌, కె.ఇస్మాయిల్‌, బి.కేశన్న, ఏసు, మునీంద్ర, రవి, జయరాజ్‌, రాజు, లక్ష్మన్న, డ్రైవర్‌ వీరేష్‌, కిరణ్‌, అల్లాబకాష్‌, రంగన్న పాల్గొన్నారు.