డప అర్బన్ : మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఆప్కాస్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. క్లాప్ డ్రైవర్లకు రూ.18,500 వేతనం ఇవ్వాలని పేర్కొన్నారు. కోవిడ్‌లో తీసుకున్న కార్మికులను అప్కాస్‌లోకి బదిలీ చేయాలని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమిస్కిల్డ్ వేతనాలు అమలు చేయాలని పేర్కొన్నారు. అర్హులైన కార్మికులందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని తెలిపారు. రక్షణ పరికరాలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రారెడ్డి, వెంకటసుబ్బయ్య, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు తిరుపాల్, ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్, కోశాధికారి గోపి, నగర అధ్యక్షులు సుంకర రవి, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఓబులేసు, నాయకులు ప్రకాష్, శ్రీరామ్, ఆనంద్, దస్తగిరమ్మ, కొండమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు. బద్వేలు : మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె. నాగేంద్రబాబు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ స్థానిక మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించారు. తమ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విడనాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ కనీస వేతనం 26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ సిబ్బందికి సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, సరెండర్ లీవులు, కోవిడ్-19 విపత్తులో పనిచేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేసే దిశగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని లేనిపక్షంలో రాబోవు రోజులలో రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె నిర్వహించవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు ఎం. గౌతమి, పట్టణ అధ్యక్షురాలు జి. అనంతమ్మ, వడ్డెర వత్తిదారుల సంఘం పట్టణ నాయకులు జి. సుబ్బరాయుడు, మున్సిపల్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు పులి శ్యాం ప్రవీణ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు దియ్యాలహరి, ఉపాధ్యక్షులు గంటా శ్రీనివాసులు, దియ్యాల దేవమ్మ, కోశాధికారి కాలువ శివకుమార్, ప్రధాన కార్యదర్శి దియ్యాల నాగేంద్రబాబు, కార్యదర్శులు బద్వేల్ ప్రవీణ్ కుమార్ నాగరపు సత్తిరాజు, కమిటీ సభ్యులు ఇండ్ల చంద్రశేఖర్, పద్మిశెట్టి రామయ్య పాల్గొన్నారు.










