కడప అర్బన్ : ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన హామీని అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ డిమాండ్ చేశారు. శనివారం సిఐటియు జిల్లా కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడుతూ మాట తప్పను మడమ తిప్పను అన్న సిఎం బహిరంగ సభల్లో ఇచ్చిన హామీలు విస్మరిం చడం బాధకరమని పేర్కొన్నారు. కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7న చలో తిరుపతి నిర్వహిస్తున్నామని తెలిపారు. విఆర్‌ఎలకు రూ.15వేలు ఇస్తానని సిఎం ఇంత వరకు ఇవ్వలేదన్నారు. ఈ నెల 7,8న కలెక్టరేట్ ఎదుట రిలేదీక్షలు చేపట్టనున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులు పోరాటాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈనెల 7 ఆందోళన చేయనున్నారని చెప్పారు. గ్రామ పంచాయతి, మధ్యాహ్న భోజనం, ఆశ వర్కర్లకు కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వడం లేదన్నారు. అంగన్‌వాడీలకు తెలంగాణ కన్న వెయ్యి రూపాయలు అందనంగా ఇస్తామని చెప్పి రూ.2వేల తక్కువ ఇస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో 25వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. వీరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్ రద్దు చేయాలన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. విద్యుత్, మున్సిపల్, విఆర్‌ఒ, కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనలు చేపట్టాలని పిలుపులు నిచ్చారు. సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి, కోశాధికారి లక్ష్మిదేవి, నగర అధ్యక్షులు చంద్రారెడ్డి పాల్గొన్నారు.










