Nov 12,2022 22:47

 సిఐటియు ఎన్టీఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌
ప్రజాశక్తి-జగ్గయ్యపేట 

కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని, సమస్యల పరిష్కారం కోసం విశాల ఐక్య ఉద్యమం నిర్మిస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌ అన్నారు. పట్టణంలో సిఐటియు కార్యాలయంలో శుక్రవారం జగ్గయ్యపేట మండల 7 వ మహాసభ షేక్‌ గౌస్‌ మియా అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా సిఐటియు ఎన్టీఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ సిహెచ్‌ శ్రీనివాస్‌ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాల ఫలితంగా దేశంలో, రాష్ట్రంలో, పారిశ్రామిక, వ్యవసాయ నిర్మాణ రంగాలు, చేతివత్తులు దెబ్బతిన్నాయన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయారు. కరోనా కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మ నిర్బర్‌ భారత్‌ నినాదం కార్పొరేట్లకే లాభాలు తెచ్చి పెడుతున్నాయి తప్ప దేశీయ పరిశ్రమలను ఆదుకోవడానికి ఏమాత్రం తోడ్పడలేదన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ని ముక్కలుగా చేసి అమ్మాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటు చేతుల్లో పెట్టి ప్రజలపై మరిన్ని బారాల మోపుతున్నారు. ఈ కాలంలో పేదరిక అసమానతలు విపరీతంగా పెరిగాయని, ఆదానీ 12 లక్షల కోట్ల సంపదతో ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచారన్నారు. ఎన్నడూ లేనివిధంగా నిరుద్యోగం9 శాతంకి, విద్యుత్‌ ఛార్జీలు, నిత్యవసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగా యన్నారు. పాలు, పెరుగు వంటి అన్ని వస్తువులపై, సేవలపై జిఎస్టి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారాలు మోపుతున్నాయన్నారు. ఉద్యోగ, కార్మికుల ఆర్థిక సమస్యలపై, హక్కులపై సిఐటియు నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. సిఐటియు ఎన్టీఆర్‌ జిల్లా 11వ మహాసభలు విజయవాడలో డిసెంబర్‌ 15,16 తేదీల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. నివేదికను షేక్‌ గౌస్‌ మియా ప్రవేశ పెట్టగా ప్రతినిధులు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మహాసభలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ.కమల మాట్లాడుతూ కార్మికులకు, స్కీం వర్కర్స్‌ కు కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మహాసభలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి ఎస్‌.ప్రణరు, సిఐటియు మధ్యాహ్న భోజన పథకం నాయకులు మదార్బీ, పద్మ, ఆశా నాయకులు సుధారాణి, బేబీ రాణి, వెంకటరమణ, పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఆదూరి రాజు, ఎస్‌.డబ్ల్యూఎఫ్‌ హన్మంతరావు, నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు ఎస్‌ రామనాధం, పారా ఎలకమ్మ తదితర నాయకులు పాల్గొన్నారు. అనంతరం 18మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జగ్గయ్యపేట మండల సిఐటియు అధ్యక్షురాలిగా డి.సుధారాణి, ప్రధాన కార్య దర్శి గా షేక్‌ గౌస్‌ మియా, ఉపాధ్యక్షులుగా పి.ఎలకమ్మ, మేరి, మదార్బీ, కార్యదర్శులుగా ఎస్‌ రామనాధం, బివీరావు, కోశాధికారి గా కుందెన శ్రీనివాస్‌, కమిటీ సభ్యు లుగా మరో 10 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.