Feb 18,2023 00:13

సిఐటియు ఆధ్వర్యాన ధర్నా చేస్తున్న కార్మికులు

సిఐటియు ఆధ్వర్యాన రైల్వే వ్యాగన్‌ కంపెనీ వద్ద ధర్నా
ప్రజాశక్తి -గాజువాక :
గాజువాక ఆటోనగర్‌ డి-బ్లాక్‌ రైల్వే వ్యాగన్‌ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల పట్ల యాజమాన్యంతోపాటు సంబంధిత కారట్రాక్టర్లు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని గాజువాక సిఐటియు నేత రాంబాబు విమర్శించారు. ఇటీవల విధి నిర్వహణలో ప్రమాదానికి గురైన గోపి అనే కార్మికునికి మెడికల్‌ బెనిఫిట్‌ కల్పించాలని కోరుతూ శుక్రవారం వ్యాగన్‌ కంపెనీ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ప్రమాదానికి గురైన కార్మికునికి నాలుగు నెలలైనా అటు యాజమాన్యం గానీ, ఇటు కాంట్రాక్టర్‌ గానీ ఎటువంటి మెడికల్‌ బెనిఫిట్స్‌, వేతనం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం దుర్మార్గమన్నారు. కార్మికుల సమస్యలు యాజమాన్యానికి తెలియనీయకుండా విభజించి పాలించు విధానాన్ని అవలంభిస్తూ 15మంది చొప్పున కార్మికులకు ఒక కాంట్రాక్టర్‌ను నియమించి చెల్లాచెదురుచేస్తున్నారని దుయ్యబట్టారు. విధి నిర్వహణలో ప్రమాదానికి గురైన కార్మికులకు మెడికల్‌ బెనిఫిట్స్‌ ఇవ్వకపోవడం, రెండు రోజులు సెలవు పెడితే విధుల నుంచి తొలగించడం, ఇఎస్‌ఐ, పిఎఫ్‌, ఇతర కార్మిక నిబంధనలకు లోబడి కల్పించాల్సిన సౌకర్యాలు లేకుండా చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రైల్వే వ్యాగన్‌ కంపెనీ యాజమాన్యం స్పందించి తగు చర్యలు చేపట్టి, కార్మికులకు న్యాయం చేయాలని లేకుంటే తీవ్రస్థాయిలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆటోనగర్‌ సిఐటియు కార్యదర్శి డి.రమణ, గాజువాక సిఐటియు కార్యదర్శి లోకేష్‌, అప్పారావు, అవతారం రామకృష్ణ, గోపి, కార్మికులు పాల్గొన్నారు..