ప్రజాశక్తి-రాజవొమ్మంగి
సమస్యలు పరిష్కారం కోసం అసంఘటిత కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, సిఐటియు జిల్లా నాయకులు మట్ల వాణీశ్రీ, పుట్ట రామరాజు పిలుపునిచ్చారు. సిఐటియు వై.రామవరం మండల మహాసభ సోమవారం ఆ సంఘం మండల నాయకులు కె.శాంతిరాజు అధ్యక్షతన వై.రామవరంలో జరిగింది. ఈ సందర్భంగా రామారావు, వాణీశ్రీ, రామరాజు మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, మిడ్డేమిల్స్, విఓఏ వంటి స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. వారికి కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పర్మినెంట్ చేయాలని, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర ధరలను ప్రభుత్వాలు విపరీతంగా పెంచాయని, అందుకు అనుగుణంగా కార్మికుల జీతాలు పెంచకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మండల కమిటీ ఎన్నిక
అనంతరం మండలం కమిటీ ఎన్నిక జరిగింది. మండల అధ్యక్ష, కార్యదర్శులుగా జి.బేబీరాణి, కె.శాంతిరాజు, ఉపాధ్యక్షులుగా కె.మంగమ్మ, సహాయక కార్యదర్శిగా జి.వరుణ్, ఆఫీసు బేరర్స్‌గా ఎస్.శైలజ, కె.తులసి ఎన్నికయ్యారు.
సిఐటియు విఆర్.పురం మండల కమిటీ ఎన్నిక
విఆర్.పురం : స్థానిక రేఖపల్లిలో సిఐటియు నాయకులు ఎం.రాజేశ్వరి అధ్యక్షతన జరిగిన సిఐటియు మండల మహాసభలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులుగా సత్యవతి, ఎం.రాజేశ్వరి, ఆఫీసు బేరర్స్‌గా కనక లక్ష్మి, ఎం శైలజ, సుజాత, నాగమణి, దూలమ్మ, సునీత, శాంత కుమారి, బి.మల్లేశ్వరి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పూనెం సత్యనారాయణ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మికులు హక్కులు, చట్టాలను తుంగలో తొక్కి బడా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తుందని విమర్శించారు. ప్రభుత్వం రంగ సంస్థలను ప్రయివేటు శక్తులకు ధారాదత్తం చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.










