ప్రజాశక్తి-కాకినాడ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క కార్మిక సమస్యా పరిష్కారం చేయలేదని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నరసింగారావు విమర్శించారు. కచేరిపేట, లక్ష్మీదాస్ భవన్‌లో గురువారం నిర్వహించిన సిఐటియు జిల్లా వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. 64 షెడ్యూల్ పరిశ్రమల్లో వేతన సవరణ జరిగి 15 ఏళ్లు గడుస్తోందన్నారు. తక్షణమే పరిశ్రమంలో పని చేసే కార్మికులందరికీ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు దాచుకున్న సొమ్మును సైతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా తరలించిందన్నారు. వారికి అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు నిలుపుదల చేసిందని, సంక్షేమ బోర్డు సాధన కోసం భవన నిర్మాణ కార్మికులు పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. యజమానులకు కోట్ల డాలర్లు లాభాలు కురిపిస్తున్న ఆక్వా రంగంలో పనిచేసే కార్మికులెవరికీ భద్రతా సౌకర్యాలు, కార్మిక చట్టాలు అమలు, సేఫ్టీ సౌకర్యాలు, పిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయడం లేదని, రోజుకొక పారిశ్రామిక ప్రమాదం కాకినాడలో జరుగుతుంటే జిల్లా కార్మికశాఖ, ఫ్యాక్టరీ ఇన్స్‌పెక్టర్, అధికార యంత్రాంగం మొద్దు నిద్రపోతోందని విమర్శించారు. సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి, జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషాబాబ్జి, ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకా రమణ, నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, ఉపాధ్యక్షులు మేడిశెట్టి వెంకటరమణ, సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు ఎరుబండి చంద్రావతి, చంద్రమళ్ల పద్మ, నక్కెళ్ల శ్రీను, నర్ల ఈశ్వరి, దారపురెడ్డి క్రాంతి, కొప్పిశెట్టి సత్తిబాబు, రొంగల ఈశ్వరరావు, షేక్ పద్మ, ఆకుల సత్యన్నారాయణ, జీవ, నందేశ్వరరావు, కరణం విశ్వనాధం పాల్గొన్నారు.










