ప్రజాశక్తి - మంగళగిరి : మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య, ఇతర కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్య ంలో ధర్నా చేశారు. అనంతరం కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ కె.హేమమాలినికి వినతి పత్రం అందజేశారు. సిఐటియు నాయకులు ఎస్‌ఎస్ చెంగయ్య, ఎం.రవి, బి.వెంకటేశ్వర్లులు మాట్లాడుతూ కార్మికులు దీర్ఘకాలికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని, పలుమార్లు విన్నవించినా పరిష్కరించడం లేదని విమర్శించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు ఆన్‌లైన్‌లో ఉద్యోగుల చూపి ఇళ్ల స్థలాలు, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాలు రద్దు చేశారని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న చెప్పులు, సబ్బులు, నూనెలు ఇవ్వాలన్నారు. విలీన గ్రామాల పారిశుధ్య కార్మికులకు రూ.21 వేల జీతం, క్లాప్ ఆటో డ్రైవర్లకు రూ.18,500 అమలు చేయాలని, రాజధాని సిఆర్‌డిఎ కార్మికులను కార్పొరేషన్‌లో విలీనం చేసి 105 మందికి కార్మికులకు మూడు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని, విలీన గ్రామాల పారిశుధ్య కార్మికులకు చెప్పులు, సబ్బులు, నూనెలు యూనిఫామ్, పిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని కోరారు. ఎండ తీవ్రంగా ఉన్నందున మధ్యాహ్నం షిఫ్ట్ మూడు గంటల నుండి 6 గంటల వరకు మార్చాలని, పిఎఫ్ నాలుగు నంబర్లు సరిచేసి ఒకే నంబర్లోకి డబ్బులు జమ చేయాలని, ఇఎస్‌ఐ కార్డులు మున్సిపల్ అధికారులే తయారు చేసి కార్మికులకు ఇవ్వాలని కోరారు. ఆదివారం సెలవు కార్పొరేషన్‌లో అన్నిచోట్లా అమలు చేయాలని, ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమిస్కిల్ జీతాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు మంగళగిరి పట్టణ కార్యదర్శి వై.కమలాకర్, యూనియన్ నాయకులు పి.పూర్ణ, కె.గోపి, కె.వెంకమ్మ, పి.మేరీ, ఎస్.శాంతి, జి.నాంచారమ్మ పాల్గొన్నారు.










